సింగరేణి కార్మికుల కీలక సమస్యలు పరిష్కరించాలి – సింగరేణి డ్రైవర్స్, ఈపీ ఆపరేటర్స్ అండ్ యూజీ ఆల్ ట్రేడ్ వర్కర్స్ యూనియన్.
సింగరేణి కార్మికుల కీలక సమస్యలు పరిష్కరించాలి. సింగరేణి డ్రైవర్స్, ఈపీ ఆపరేటర్స్ అండ్ యూజీ ఆల్ ట్రేడ్ వర్కర్స్ యూనియన్.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతిపత్రం.
సీఎంబీ పునరుద్ధరణ, వారసులకు ఉద్యోగాలు, ఈపీ ఆపరేటర్ల కేడర్ స్కీమ్ అమలుపై ప్రధాన డిమాండ్లు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
మంచిర్యాల, జూన్ 13: సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రతకు సంబంధించిన ఏడు కీలక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సింగరేణి డ్రైవర్స్, ఈపీ ఆపరేటర్స్ అండ్ యూజీ ఆల్ ట్రేడ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పించింది. శనివారం మంచిర్యాల జిల్లా పద్మవినాయక ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కారుణ్య నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు డా. ఎస్. వేణుగోపాల చారి, కేంద్ర అధ్యక్షుడు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వినతిపత్రాన్ని అందజేశారు. వినతిపత్రంలో ప్రధానంగా కొత్తగూడెంలోని కార్పొరేట్ మెడికల్ బోర్డు (సీఎంబీ) సమావేశాలను వెంటనే పునరుద్ధరించి, వైద్యపరంగా అన్‌ఫిట్‌గా ఉన్న కార్మికుల పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే మెడికల్ ఇన్వాలిడేషన్‌కు గురైన కార్మికుల వారసులకు కారుణ్య నియామకాలు, పునరావాస నిబంధనల ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణికి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (టీఎస్‌జెన్‌కో) నుంచి రావాల్సిన బొగ్గు బిల్లుల బకాయిలను తక్షణమే వసూలు చేయడంతో పాటు, సంస్థ భవిష్యత్తు అభివృద్ధి, బొగ్గు ఉత్పత్తి పెంపు, ఉపాధి అవకాశాల సృష్టి కోసం కొత్త బొగ్గు గనుల అన్వేషణ, అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు. కార్మికులకు సొంత గృహ కల్పన కోసం ఇంటి స్థలాల కేటాయింపు, గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం, వడ్డీ రాయితీతో కూడిన రుణాలు అందించే సమగ్ర గృహ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అలాగే ఆర్జీ-1 ఏరియా కాలనీల్లో తరచూ ఏర్పడుతున్న విద్యుత్ అంతరాయాలను నివారించి, ముఖ్యంగా నైట్ షిఫ్ట్‌లలో పనిచేసే కార్మికుల సౌకర్యార్థం నిరంతరాయ విద్యుత్ సరఫరా కల్పించాలని డిమాండ్ చేశారు. వైద్యపరంగా అన్‌ఫిట్‌గా ప్రకటించబడిన ఈపీ ఆపరేటర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, ఎంవీ డ్రైవర్లను సేవల నుంచి తొలగించకుండా, వారి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా తేలికపాటి ప్రత్యామ్నాయ పోస్టుల్లో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వారి వేతనాలు, గ్రేడ్‌లు, పదోన్నతి అవకాశాలకు ఎటువంటి భంగం కలగకుండా రక్షించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా యాంత్రీకృత గనుల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈపీ ఆపరేటర్లకు కాలపరిమితి ఆధారిత పదోన్నతులు, కెరీర్ పురోగతి అవకాశాలు కల్పించే సమగ్ర కేడర్ స్కీమ్‌ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చర్యతో కార్మికుల మనోధైర్యం పెరగడంతో పాటు ఉత్పాదకత కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తు, సంస్థ అభివృద్ధికి సంబంధించిన ఈ సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని యూనియన్ నాయకులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఐ.ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షుడు కోలా కనకయ్య, ఆర్గనైజర్ కార్యదర్శి కె.అశోక్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కట్కూరి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.