Take a fresh look at your lifestyle.

కార్మికుల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్‌ అండ : కేటికె.1 ఇంక్లైన్ గేట్ మీటింగ్ లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు.

0 4

కార్మికుల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్‌ అండ.
డీఎంఎఫ్‌, సీఎస్‌ఆర్‌ నిధులు సింగరేణి ప్రాంతాల్లోనే ఖర్చు చేయాలి.
సొంతింటి స్థలాలు, మెడికల్‌ బోర్డు, ఆదాయపన్నుపై అసెంబ్లీలో ప్రస్తావించాం.
కేటికె.1 ఇంక్లైన్ గేట్ మీటింగ్ లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్‌-భూపాలపల్లి, సెప్టెంబర్ 23: కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల హక్కుల పరిరక్షణకు అండగా ఉంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో పలు అంశాలను ప్రస్తావించడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. భూపాలపల్లిలోని కేటీకే-1 ఇన్‌క్లైన్‌ ఆవరణలో ఐఎన్టీయూసీ అనుబంధ సింగరేణి కోల్‌ మైన్స్‌ లేబర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన గేట్‌ మీటింగ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఏరియా ఐఎన్టీయూసీ బ్రాంచ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బేతెల్లి మధుకర్‌రెడ్డి సారథ్యంలో, కేటీకే-1 ఇన్‌క్లైన్‌ ఐఎన్టీయూసీ ఫిట్‌ సెక్రటరీ సొతుకు సమ్మయ్య అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సింగరేణి ద్వారా వచ్చే డీఎంఎఫ్‌, సీఎస్‌ఆర్‌ నిధులను ఏ ప్రాంతంలో ఎంత ఆదాయం వస్తుందో ఆ ప్రాంత అభివృద్ధికే వినియోగించాలని ఎమ్మెల్యే అన్నారు. భూపాలపల్లి ఏరియా ఆసుపత్రిలో అన్ని విభాగాలకు అవసరమైన వైద్యులను అవుట్‌సోర్సింగ్‌ విధానంలో నియమించడంతో పాటు క్యాథ్‌ల్యాబ్‌, ఎంఆర్‌ఐ, బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలని కోరారు. బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా పీఆర్‌పీ, ఎస్‌డీపీ వంటి రక్త భాగాల సేవలు కార్మికులు, స్థానిక ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అన్‌ఫిట్‌ అయిన కార్మికుల పిల్లలకు త్వరితగతిన ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఏరియా ఆసుపత్రిలోనే మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. పేరు మార్పు తదితర సమస్యలను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల ఆదాయపన్నును కంపెనీయే భరించే విధానం అమలు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని చూస్తున్న లేబర్‌ కోడ్‌ వల్ల కార్మికుల హక్కులకు నష్టం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. సింగరేణి కార్మికుల లాభాల్లో వాటా, ఆదాయపన్ను, సొంతింటి స్థలాలు, అన్‌ఫిట్‌ కార్మికుల పిల్లల ఉద్యోగాలు, పేరు మార్పులు, వైద్య సదుపాయాలు తదితర సమస్యల పరిష్కారానికి కోల్‌బెల్ట్‌కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులతో కలిసి దసరాకు ముందే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. కార్మికుల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులుగా వారి హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తామని గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి అవసరమైన పోరాటం, ప్రయత్నం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ ఛైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ ఛైర్మన్ అంబాల శ్రీనివాస్, కాంగ్రేస్ నాయకులు దాట్ల శ్రీనివాస్, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు, జనరల్‌ సెక్రటరీ పసునూటి రాజేందర్‌, సెంట్రల్‌ వైస్‌ ప్రెసిడెంట్లు జోగ బుచ్చయ్య, అండెం రఘుపతిరెడ్డి, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీలు రత్నం సమ్మిరెడ్డి, వేణుగోపాల్‌ యాదవ్‌, సెంట్రల్‌ సెక్రటరీ చెల్పూరి సదయ్య, మైనింగ్‌ స్టాఫ్‌ ఇన్‌చార్జి గడిపే చక్రపాణి, భూపాలపల్లి ఏరియా స్ట్రక్చర్‌ కమిటీ నాయకులు బొడ్డు అశోక్‌, షేక్‌ హుస్సేన్‌, బ్రాంచ్‌ నాయకులు కుడుదుల శంకర్‌, రవికిరణ్‌, కేటికె.1 ఇంక్లైన్ ఐఎన్టీయూసీ టెంపుల్ కమిటి, మైన్స్ కమిటి సభ్యులు, నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.