పెద్దమ్మ గుడిలో నిత్య అన్నదానం ప్రారంభం : ఈఓ రజనికుమారి.
భక్తులు, దాతలు అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాలి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
పాల్వంచ, సెప్టెంబర్ 7: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాధపురం-కేశవాపురం గ్రామంలోని శ్రీ కనకదుర్గా దేవస్థానం (పెద్దమ్మ తల్లి)లో నిత్య అన్నదానం ప్రారంభమైంది. దేవస్థానం ప్రాంగణంలో నూతక్కి శ్రీనివాసరావు నిర్మించిన అన్నదాన సత్రంలో సోమవారం నాగేశ్వరరావు–జ్యోతి దంపతులు, జ్యోతి పుట్టినరోజు సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ రజనికుమారి, అన్నదాన సత్రం నిర్మించిన నూతక్కి శ్రీనివాసరావు, దేవాలయ మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మంగళవారం అన్నదానం నిర్వహించేందుకు కొండం పుల్లయ్య–సుగుణమ్మ దంపతులు రూ.5,116 విరాళంగా అందజేశారు. భక్తులు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, ఇతర ముఖ్యమైన రోజులు, పర్వదినాల్లో అన్నదానం నిర్వహించేందుకు ఆలయ కార్యాలయంలో సంప్రదించాలని ఈఓ రజనికుమారి సూచించారు.