Take a fresh look at your lifestyle.

భూపాలపల్లి బిట్స్ పాఠశాలలో నేత్ర, అవయవ, శరీర దానంపై అవగాహన.

0 2

బిట్స్ పాఠశాలలో నేత్ర, అవయవ, శరీర దానంపై అవగాహన.
విద్యార్థి దశ నుంచే దానంపై అవగాహన పెంచుకోవాలి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 7:జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్‌ (బిట్స్)లో సోమవారం నేత్ర, అవయవ, శరీర దానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని దానాల ప్రాధాన్యత, వాటి ద్వారా సమాజానికి కలిగే ప్రయోజనాలపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. నేత్ర, అవయవ దానంపై తాము తెలుసుకున్న విషయాలను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు తెలియజేసి, వారిలోనూ అవగాహన కల్పిస్తామని తెలిపారు. అవసరమైన వారికి అవయవ దానం ద్వారా జీవనోపాధి, నేత్రదానం ద్వారా చూపును అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అసోసియేషన్ చైర్మన్ దేవనూరి చంద్రమౌళి మాట్లాడుతూ.. విద్యార్థి దశలోనే సెల్‌ఫోన్ వినియోగాన్ని నియంత్రించుకోవాలని సూచించారు. అధికంగా సెల్‌ఫోన్ వినియోగించడం వల్ల కళ్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని, విద్యార్థులు మొబైల్ వినియోగాన్ని తగ్గించి చదువుపై ఎక్కువగా దృష్టి సారించాలని కోరారు. అదే సమయంలో నేత్ర, అవయవ, శరీర దానం ద్వారా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ దానంపై అవగాహన పెంచుకుని, ఇతరులకు కూడా చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు. పాఠశాల ప్రిన్సిపల్ రజనీకాంత్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సైన్స్, ముఖ్యంగా బయాలజీపై అవగాహన ఎంతో ముఖ్యమన్నారు. నేత్ర, అవయవ దానం, కాడవర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం భవిష్యత్తులో వైద్య విద్యను అభ్యసించాలనుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ అంశాలపై బయాలజీ ఉపాధ్యాయుల ద్వారా తరగతి గదుల్లోనూ ప్రత్యేక అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బందెల భూమయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణస్వామి, జనరల్ సెక్రటరీ డాక్టర్ జె.సి. రాజు, ఉపాధ్యక్షుడు బుర్ర రాజన్న, ఉపాధ్యాయులు చాంద్ పాషా, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. “నేత్రదానం–మరొకరికి చూపు.. ఒక కుటుంబానికి ఆశ” అనే సందేశంతో విద్యార్థుల్లో నేత్ర, అవయవ, శరీర దానంపై అవగాహన కల్పించారు.

Leave A Reply

Your email address will not be published.