Take a fresh look at your lifestyle.

మానవ హక్కుల కోసం అలుపెరుగని కృషి….

0 1,357

మానవ హక్కుల కోసం అలుపెరుగని కృషి

—  మానవ హక్కుల ఉద్యమకారిణి ప్రొఫెసర్ మాధవి

— జె.జె.సి.పి. బాబూరావు రీసెర్చ్ స్కాలర్

కామారెడ్డి ప్రతినిధి ,ఆగస్టు 2 (లోకంతీరు) : మానవ హక్కుల కోసం అలుపెరుగని కృషి చేసిన మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకురాలు ప్రొఫెసర్ మాధవి అనారోగ్యంతో గత నెల 28 నాడు ఉదయం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో మరణించడం కడు విషాదకరం. ఆమె హక్కుల ఉద్యమకారుడు దివంగత బాలగోపాల్ సోదరి. హక్కుల ఉద్యమాల్లో బాలగోపాల్ అనుసరించిన కార్యాచరణని అనుసరించి బాధితుల పక్షాన న్యాయం కోసం ఆమె అవిశ్రాంతంగా ఉద్యమించారు.

బ్రాహ్మణ పండిత కుటుంబంలో జన్మించిన మాధవి సికింద్రాబాద్ లోని ఈస్ట్ మారేడుపల్లిలో గల కస్తూర్బా మహిళా కళాశాలలో కామర్స్ విభాగంలో ప్రొఫెసర్ గాను బాధ్యతలు నిర్వహించి పదవి విరమణ పొందారు. ప్రొఫెసర్ మాధవి ప్రగతిశీల మహిళా సంఘం ( పి.ఓ.డబ్ల్యూ ) లో క్రియాశీల పాత్రను నిర్వహించారు. అలాగే హక్కుల సంఘాలలోనూ ఆమె క్రియాశీలకంగాను ఉద్యమించారు. మానవ హక్కుల వేదిక ( హెచ్.ఆర్.ఆఫ్ ) జంటనగరాల అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు నిర్వహించారు.

ప్రొఫెసర్ మాధవి గొప్ప పరిశోధకురాలు, రచయిత్రి మరియు బహుభాషా అనువాదకురాలు. ఆమె నిరంతరంగా అధ్యయనం మరియు పరిశోధనలో నిమగ్నమయ్యేవారు. పత్రికలలో ఆమె అనేకంగా ఆంగ్ల వ్యాసాలు రాయడమే కాకుండా పలు పుస్తక అనువాదాలు చేశారు. మహిళా హక్కులు, ఆహార భద్రత మరియు ఉపాధి హామీ పథకం మొదలైన వాటిపై ప్రొఫెసర్ మాధవి పూర్తి స్థాయి పరిశోధన చేశారు. కార్మిక హక్కుల సాధన కోసం ఆమె కృషి చేశారు. అలాగే ఆస్తిత్వ ఉద్యమాల్లోనూ ఆమె విశేషంగా కృషి చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనల ఘటనలు ఎక్కడ జరిగిననూ బాధితుల పక్షాన నిలబడి తన గొంతుని వినిపించే ప్రొఫెసర్ మాధవి మరణం హక్కుల ఉద్యమాలకు మాత్రమే కాకుండా అంతిమంగా సమసమాజ స్వాప్నికులకు తీరనిలోటు. ఈ సందర్భంగా ఆమెకు వినమ్ర నివాళులు అర్పిస్తున్నాను.

Leave A Reply

Your email address will not be published.