
సింగరేణిలో రిజర్వేషన్ల అమలుపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమీక్ష.
ప్రతి మూడు నెలలకు సమీక్ష సమావేశం.. రోస్టర్ వెరిఫికేషన్ ఏటా నిర్వహించాలి.
సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, సెప్టెంబర్ 30: సింగరేణి సంస్థలో రిజర్వేషన్ ఆఫ్ రూల్ (ఆర్‌ఓఆర్) అమలు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సింగరేణి సంస్థలోని వివిధ ఏరియాల నుంచి లైజన్ అధికారులు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, ఏరియా వైస్ ప్రెసిడెంట్లు, కార్మికులు హాజరయ్యారు. సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్, జనరల్ సెక్రెటరీ నాగేశ్వరరావు, చీఫ్ లైజన్ ఆఫీసర్ దుర్గం రామచందర్, రామగుండం-3 వైస్ ప్రెసిడెంట్ బత్తుల శంకర్, శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ డేగల ప్రవీణ్‌కుమార్‌తో పాటు వివిధ ఏరియాల ప్రతినిధులు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్‌ఓఆర్ ప్రకారం ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని, రిజర్వేషన్ల అమలుపై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్న రోస్టర్ వెరిఫికేషన్‌ను ఇకపై ప్రతి సంవత్సరం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలను పరిశీలించిన కమిషన్ ప్రతినిధులు, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. సింగరేణి సంస్థ పరిధిలోని ప్రతి జీఎం కార్యాలయం ఎదుట భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిర్ణయించింది. సంస్థలోని అన్ని ఏరియాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని యాజమాన్యానికి సూచించింది. సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చిన సీఎండీకి సంఘం ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సూపర్‌వైజర్లకు మెడికల్ సమస్యల పేరుతో ఇబ్బందులు పెట్టొద్దు : గడిపే చక్రపాణి.
సింగరేణి భూపాలపల్లి ఏరియా ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గడిపే చక్రపాణి మాట్లాడుతూ మైనింగ్ స్టాఫ్ ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. అనారోగ్యంతో వైద్య పరీక్షలకు వెళ్లే కొంతమంది సూపర్‌వైజర్లను జనరల్ మజ్దూర్‌లుగా ముద్ర వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వారిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపారు. ఈ అంశాన్ని మానవతా దృక్పథంతో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 2016–17లో సింగరేణిలో సుమారు 700 మంది సూపర్‌వైజర్లుగా నియమితులయ్యారని, వారిలో ఆర్‌ఓఆర్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు గణనీయంగా ఉన్నారని చక్రపాణి పేర్కొన్నారు. అయితే వీరికి దాదాపు పదేళ్లుగా అంతర్గత పదోన్నతులు లభించలేదని, దీనివల్ల భవిష్యత్తులో వారు ఉద్యోగపరంగా వెనుకబడే అవకాశం ఉందని కమిషన్‌కు వివరించారు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ప్రమోషన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా ప్రతి మూడు నెలలకు సమీక్ష నిర్వహించాలని ప్రతినిధులు కోరారు. రిజర్వేషన్ల అమలు, పదోన్నతులు, రోస్టర్ నిర్వహణ తదితర అంశాలను క్రమం తప్పకుండా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ సభ్యుడు రేణుకుంట్ల ప్రవీణ్‌రావు, సికింద్రాబాద్ ఎస్సీ కార్యాలయ సెక్రటరీ జనరల్ అంటోటి నాగేశ్వర్‌రావు, ఎస్సీ లైజన్ ఆఫీసర్, భద్రతా విభాగం సేఫ్టీ ఆఫీసర్ చంద్రశేఖర్, ఎస్టీ లైజన్ ఆఫీసర్, సీనియర్ అండర్ మేనేజర్ మోహన్, ఓవర్ మెన్ సికందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.