జెన్కోకు రోజుకు 75,500 టన్నుల బొగ్గు సరఫరా.
ఎల్ నినో పరిస్థితుల్లో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా కార్యాచరణ.
రైల్వే రేకులు, రవాణా, లోడింగ్-అన్‌లోడింగ్‌పై సింగరేణి–జెన్కో సీఎండీల సమీక్ష.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, సెప్టెంబరు 29: రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితుల కారణంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేసేందుకు సింగరేణి, తెలంగాణ జెన్కో సంస్థలు సమన్వయ కార్యాచరణకు శ్రీకారం చుట్టాయి. జెన్కో విద్యుత్ కేంద్రాలకు రోజుకు 75,500 టన్నుల బొగ్గు సరఫరా చేసే లక్ష్యంతో మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి, తెలంగాణ జెన్కో సీఎండీ డాక్టర్ హరీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్లు, జెన్కో విద్యుత్ కేంద్రాల చీఫ్ ఇంజినీర్లు, ఇరు సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్ కేంద్రాల వారీగా బొగ్గు అవసరాలు, ప్రస్తుతం జరుగుతున్న సరఫరా, బొగ్గు నాణ్యత, రైల్వే రేకుల లభ్యత, లోడింగ్–అన్లోడింగ్, రవాణాలో ఎదురవుతున్న సమస్యలను సమగ్రంగా సమీక్షించారు.
రైలు మార్గంలో 56 వేల టన్నులు:
రోజుకు 14 రైల్వే రేకుల ద్వారా 56 వేల టన్నులు, రోడ్డు మార్గంలో 19,500 టన్నుల బొగ్గును జెన్కో కేంద్రాలకు తరలించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో కొత్తగూడెం విద్యుత్ కేంద్రానికి రోజుకు 24 వేల టన్నులు, కాకతీయకు 4,500 టన్నులు, భద్రాద్రికి 15 వేల టన్నులు, యాదాద్రికి 34 వేల టన్నుల బొగ్గు అవసరాలను కేంద్రాల వారీగా సమీక్షించారు. యాదాద్రి విద్యుత్ కేంద్రానికి బొగ్గు సరఫరాలో ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి రెండు రేకుల ద్వారా రోజుకు 8 వేల టన్నులు, సింగరేణి స్థానిక గనుల నుంచి ఆరు రేకుల ద్వారా 36 వేల టన్నులు రవాణా చేసే అంశంపై కార్యాచరణ రూపొందించారు. నైనీ బొగ్గు బ్లాక్ నుంచి సరఫరాను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సింగరేణి అధికారులు తెలిపారు.
గత ఏడాదితో పోలిస్తే 31 శాతం అధికం:
ఈ నెల 28వ తేదీ నాటికి జెన్కో విద్యుత్ కేంద్రాలకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా కలిపి 15.02 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేసినట్లు సింగరేణి మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబరు ఇదే కాలంలో 11.44 లక్షల టన్నులు సరఫరా చేయగా, ఈసారి 3.58 లక్షల టన్నులు అధికంగా, సుమారు 31 శాతం పెరుగుదల నమోదైనట్లు తెలిపారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో విద్యుత్ డిమాండ్ పెరిగిందని, పెరిగిన ఉత్పత్తికి అనుగుణంగా అదనపు బొగ్గు అవసరం ఏర్పడుతోందని జెన్కో అధికారులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. బొగ్గు సరఫరా, రవాణా, స్వీకరణలో తలెత్తే సమస్యలను సంబంధిత ఏరియా జనరల్ మేనేజర్లు, విద్యుత్ కేంద్రాల చీఫ్ ఇంజినీర్లు పరస్పర సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. రోజువారీ పరిస్థితులపై ఫోన్, వాట్సప్ గ్రూపుల ద్వారా సమాచార మార్పిడి కొనసాగించాలని, రైల్వే రేకుల సమీకరణతో పాటు లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి అంతరాయం కలగకుండా నాణ్యమైన బొగ్గు సరఫరా జరిగేలా ఇరు సంస్థలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ప్లాంట్ల చీఫ్ ఇంజినీర్లు, బొగ్గు సరఫరా చేసే సింగరేణి ఏరియాల జనరల్ మేనేజర్లతో సంయుక్తంగా ఈ స్థాయిలో సమన్వయ సమీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో సింగరేణి డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ (ఆపరేషన్స్), కె. వెంకటేశ్వర్లు (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్), జీఎం (కో ఆర్డినేషన్, మార్కెటింగ్) టి. శ్రీనివాస్, జెన్కో విద్యుత్ కేంద్రాల చీఫ్ ఇంజినీర్లు, సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.