Take a fresh look at your lifestyle.

సింగరేణి వికాసమే ప్రభుత్వ ధ్యేయం. ఇతర రాష్ట్రాల్లో కొత్త బొగ్గు బ్లాకులు సాధించాలి. కోల్‌బెల్ట్ సమస్యలపై ప్రతి 15 రోజుcలకు సమీక్ష. మంత్రులు, ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం భట్టి ఉన్నతస్థాయి సమావేశం.

0 21

(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, మే 25:
ప్రస్తుత పోటీ మార్కెట్లో సింగరేణి సంస్థ నిలదొక్కుకోవాలంటే ఇతర రాష్ట్రాల్లో కొత్త బొగ్గు బ్లాకులు సాధించడం అత్యవసరమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యానికి సూచించారు. తక్కువ ధరకే అధిక నాణ్యత గల బొగ్గు ఉత్పత్తి చేసే కొత్త బ్లాకుల సాధనపై దృష్టి సారించాలని, మార్కెట్లో నాణ్యమైన బొగ్గు విక్రయాల ద్వారా సంస్థను మరింత బలోపేతం చేయాలని ఆయన పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన సింగరేణి కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేల సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, ఎనర్జీ స్పెషల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాశ్, జీఏడీ డైరెక్టర్ గౌతమ్ పొట్రు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, ఎంపీ బలరాం నాయక్‌తో పాటు కోల్‌బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, సింగరేణి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణకు కొంగుబంగారంగా నిలిచిన సింగరేణితో పాటు కోల్‌బెల్ట్ ప్రాంత సమగ్ర అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కార్మికులు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. గత పదేళ్లలో కొత్త బ్లాకుల సాధనలో నిర్లక్ష్యం జరిగిందని విమర్శించిన ఆయన, 100 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణిని తెలంగాణ ప్రభుత్వం ఒడిశా వరకు విస్తరించేలా చర్యలు చేపట్టిందన్నారు. కొత్త బ్లాకుల సాధనతో పాటు నాణ్యమైన బొగ్గు విక్రయాల ద్వారానే సంస్థ భవిష్యత్తును భద్రపరచగలమని ఆయన అభిప్రాయపడ్డారు. సమావేశంలో కోల్‌బెల్ట్ ప్రాంత సమస్యలను ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు చేస్తున్న సూచనలు, విజ్ఞప్తులను సానుకూలంగా పరిగణించాలని భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేల విజ్ఞాపనలపై తీసుకున్న చర్యలను సమీక్షిస్తామని ప్రకటించారు. సింగరేణి సంస్థ అభివృద్ధితో పాటు కార్మికులు, కోల్‌బెల్ట్ ప్రాంత ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.