సింగరేణిలో బొగ్గు మాయం కాదు.. ఉత్పత్తి లెక్కల్లోనే తేడా.
12వ వేజ్ బోర్డు కోసం ఉద్యమం తప్పదు – అవసరమైతే సమ్మె: ఏఐటీయూసీ నేతలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని టౌన్, జూన్ 27: సింగరేణిలో బొగ్గు మాయం అయ్యిందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, వాస్తవానికి ఇది ఉత్పత్తి లెక్కల్లో వచ్చిన తేడాలే తప్ప నిజమైన మాయం కాదని ఏఐటీయూసీ నాయకులు స్పష్టం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో రాజకీయ జోక్యం కారణంగానే జాప్యం జరుగుతోందని ఆరోపించారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయం అయ్యిందంటూ కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. టార్గెట్ రీచ్ కోసం ఉత్పత్తి లెక్కలు వాస్తవానికి మించి చూపించబడిన కారణంగా తేడాలు ఏర్పడ్డాయని తెలిపారు. ఇది గత ప్రభుత్వ హయాంలో కూడా చోటుచేసుకుందని గుర్తు చేశారు. 2017లో 67 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని అప్పటి కాంగ్రెస్ ప్రతినిధి దాసోజు శ్రావణ్ ఆరోపించిన విషయాన్ని కూడా వారు గుర్తు చేశారు. అయితే తాము ఆ ఆరోపణలను సమర్థించడం లేదని, వాస్తవాలను మాత్రమే కార్మికులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తాము కష్టపడి బొగ్గు ఉత్పత్తి చేస్తుంటే, అక్రమాలు జరుగుతున్నాయన్న భావనతో కార్మికుల్లో అనవసర ఆందోళన ఏర్పడుతోందని తెలిపారు. రాజకీయ నాయకులు హడావుడిగా సింగరేణి ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పూజకు ముందు గణపతి మంత్రం చదివినట్లు రాజకీయ నాయకులు ఏఐటీయూసీని విమర్శలకు కేంద్రంగా చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మెడికల్ దందా, చందాల డబ్బుల విషయంలో టీబీజీకేఎస్ నాయకులు పరస్పరం విమర్శించుకుంటూ ఇప్పుడు ఏఐటీయూసీపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. సీఎస్ఆర్, డీఎంఎఫ్టీ నిధులు బీఆర్ఎస్ హయాం నుంచే దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. 2014 నుంచి ఈ నిధులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సింగరేణి పరిశ్రమకు తీవ్ర నష్టం జరిగిందని, బొగ్గు బ్లాకుల విక్రయం కూడా అదే సమయంలో జరిగిందని విమర్శించారు. సింగరేణిలో కార్మికుల సమస్యలపై పోరాడే శక్తి ఎర్రజెండా ఏఐటీయూసీకే ఉందని, తామే గుర్తింపు సంఘమని, తామే ప్రతిపక్ష సంఘమని వారు స్పష్టం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 8న 31 డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. 25న హైదరాబాద్‌లో ఆర్ఎల్సి వద్ద చర్చలు జరిగాయని, జూలై 10లోపు యూనియన్‌తో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని ఆర్ఎల్సి సూచించినట్లు వెల్లడించారు. అలాగే సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహణను ఆపింది యాజమాన్యం కాదని, రాష్ట్ర ప్రభుత్వమే నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణిలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిందని ఆరోపించారు. 12వ వేజ్ బోర్డు సాధన, కొత్త గనుల ఏర్పాటు కోసం అన్ని సంఘాలను కలుపుకుని ఉద్యమం చేస్తామని, అవసరమైతే సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.