Take a fresh look at your lifestyle.

స్కూల్ వ్యాన్ నిర్లక్ష్యం.. మూడేళ్ల చిన్నారి దుర్మరణం.

0 14

స్కూల్ వ్యాన్ నిర్లక్ష్యం.. మూడేళ్ల చిన్నారి దుర్మరణం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
యాదాద్రి భువనగిరి, జూన్ 27:యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యానికి మూడేళ్ల చిన్నారి బలైపోయాడు. వ్యాన్ కింద పడి తీవ్ర గాయాలపాలైన నియాన్ష్ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, స్థానిక శ్రీనివాస రామానుజన్ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్‌కు చెందిన వ్యాన్ తన అన్నయ్యను ఇంటి వద్ద దింపేందుకు వచ్చింది. ఈ సమయంలో ఇంటి బయట ఉన్న నియాన్ష్ వ్యాన్ సమీపానికి వెళ్లాడు. అయితే బాలుడు వ్యాన్ ముందు ఉన్న విషయాన్ని గమనించని డ్రైవర్ వాహనాన్ని ముందుకు కదపడంతో చిన్నారి వ్యాన్ కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన బాలుడు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. చిన్నారి ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ హృదయవిదారక ఘటనతో వడపర్తి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానికులు స్కూల్ వ్యాన్ల నిర్వహణలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.