Take a fresh look at your lifestyle.

సింగరేణి బొగ్గు నిల్వలపై అధికారులను నిలదీయండి : కార్మికులకు హరీష్ రావు పిలుపు.

0 24

      

సింగరేణి బొగ్గు నిల్వలపై అధికారులను నిలదీయండి.       

కార్మికులకు బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు  హరీష్ రావు పిలుపు.

నడవని ఏఎల్‌పీ నుంచి 1.80 లక్షల టన్నుల ఉత్పత్తి ఎలా వచ్చింది?’

బొగ్గు నిల్వల అంశంపై ఎమ్మెల్యే కూనంనేనికి బహిరంగ సవాల్.

కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు సిద్ధమా?: కేంద్రానికి సూచన.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)

భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 23:సింగరేణిలో బొగ్గు నిల్వలు, ఉత్పత్తి గణాంకాలు, ఆర్థిక వ్యవహారాలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. సింగరేణిలో భారీ స్థాయిలో బొగ్గు మాయం జరిగిందని ఆరోపించిన ఆయన, బొగ్గు నిల్వల వివరాలపై యాజమాన్యాన్ని కార్మికులు నిలదీయాలని పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి కొత్తగూడెంలోని క్లబ్‌లో నిర్వహించిన సింగరేణి కార్మికుల సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న హరీష్ రావు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగరేణిలో జరుగుతున్న అంశాలను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాల కారణంగా 30 ఏళ్ల తర్వాత మళ్లీ సింగరేణి నష్టాల బాట పట్టే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘బొగ్గు ఉత్పత్తి పెంచండి.. స్కాములు ఆపండి’’ అంటూ ప్రభుత్వానికి సూచించారు.

డైరెక్టర్ల రాజీనామాలపై ప్రశ్నలు:

సింగరేణి డైరెక్టర్లు జి.వి. రెడ్డి, శ్రీనివాస్ తమ పదవులకు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అక్రమాలకు సహకరించలేదనే కారణంతోనే జి.వి. రెడ్డిపై ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించారని ఆరోపించారు.

డీజిల్ కొనుగోళ్లలోనూ అక్రమాలు:

సింగరేణిలో డీజిల్ కొనుగోళ్లలో కూడా పలు అక్రమాలు జరిగాయని, ఆర్టీఐ ద్వారా తాము అనేక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చామని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటినీ కార్మికులు గమనించాలని సూచించారు.

అప్పులు పెరిగాయని ఆరోపణ:

బీఆర్ఎస్ పాలనలో సింగరేణిపై సుమారు రూ.7 వేల కోట్ల అప్పులు మాత్రమే ఉండగా, కాంగ్రెస్ పాలనలో రెండున్నరేళ్ల వ్యవధిలో అప్పులు రూ.12,700 కోట్లకు చేరాయని హరీష్ రావు ఆరోపించారు. ప్రస్తుతం సంస్థ రూ.4,300 కోట్ల ఓవర్‌డ్రాఫ్ట్‌లో ఉందని, ఉద్యోగుల వేతనాల చెల్లింపులకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.

కార్మికులు, అధికారుల ఆందోళనలు:

మెడికల్ అన్‌ఫిట్ ఉద్యోగులకు న్యాయం జరగడం లేదని, మెడికల్ బోర్డులు నిర్వహించకుండా ఉద్యోగ అవకాశాలను నిరోధిస్తున్నారని ఆయన విమర్శించారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కార్మికులతో పాటు అధికారులు కూడా యాజమాన్యానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేసే పరిస్థితి వచ్చిందన్నారు. అధికారులపై ఒత్తిళ్లు, వేధింపులు పెరిగాయని ఆరోపించారు.

కూనంనేనికి బహిరంగ సవాల్:

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించిన హరీష్ రావు, బొగ్గు నిల్వల అంశంపై ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ‘‘మీరు కార్మికుల పక్షమా? లేక కాంగ్రెస్ ప్రభుత్వ పక్షమా?’’ అని ప్రశ్నించారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలి:

సింగరేణిలో జరిగినట్లు తాము ఆరోపిస్తున్న అక్రమాలపై చిత్తశుద్ధి ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీష్ రావు సూచించారు. బొగ్గు నిల్వల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.

ప్రముఖుల హాజరు:

సదస్సులో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, తాతా మధు, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, రేగా కాంతారావు, బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి, హరిప్రియ నాయక్, వనమా వెంకటేశ్వరరావు, వనమా రాఘవేంద్రరావు, టీబీజీకేఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి, కాపు కృష్ణ, దిండిగల రాజేందర్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.