
ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
అభివృద్ధికి సీఎం రూ.100 కోట్ల మంజూరు.. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన.
కాలనీల్లో మార్నింగ్ వాక్ నిర్వహించి సమస్యలు తెలుసుకున్న మంత్రి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఖమ్మం, ఆగస్టు 6: ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.100 కోట్ల నిధులు మంజూరు చేశారని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని మౌలిక వసతులను దశలవారీగా కల్పిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్‌తో కలిసి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 22, 23వ వార్డులైన సాయిగణేష్ నగర్, సత్యనారాయణపురం, ఇందిరమ్మ కాలనీల్లో మార్నింగ్ వాక్ నిర్వహించిన మంత్రి అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య పరిస్థితులు, మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానికులతో నేరుగా మాట్లాడి తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, రహదారులు, గృహ నిర్మాణానికి సంబంధించిన సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీల విలీనంతో ఏర్పాటైన ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించడమే లక్ష్యంగా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారని చెప్పారు. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, తుమ్మ చెట్ల పెరుగుదల, డ్రైనేజీ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటి శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర డ్రైనేజీ వ్యవస్థతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాగునీటి సమస్యలను అత్యవసరంగా పరిష్కరిస్తామని, విద్యుత్ తీగలు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను సంబంధిత శాఖల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరిస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాల కోసం ప్రజలు సమర్పించిన వినతులను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో పార్కుల అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఈ నెలాఖరులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పర్యటన సందర్భంగా మంత్రి సాయిగణేష్ నగర్‌లో రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్‌లో స్థానికులతో కలిసి టీ తాగుతూ వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం వర్షాన్ని లెక్కచేయకుండా గొడుగు పట్టుకుని ఇందిరమ్మ కాలనీలో కాలినడకన పర్యటించి ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోవడం స్థానికులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యుగంధర్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాస చారి, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఆర్డీఓ శ్రీనివాస్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.