Take a fresh look at your lifestyle.

తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ కృతజ్ఞతలు.

0 23

తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ కృతజ్ఞతలు.
సింగరేణి అభివృద్ధికి కీలక ముందడుగు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
3 వేల మందికి ఉపాధి.. భూపాలపల్లి ప్రాంత అభివృద్ధికి ఊతం.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, జూలై 7: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)కు తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపింది. మంగళవారం హైదరాబాద్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం చేసిన నిరంతర కృషి ఫలితంగానే ఈ బొగ్గు బ్లాక్ సింగరేణికి దక్కిందని అన్నారు. తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్‌లో 434.14 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, మరో 40 సంవత్సరాల పాటు మైనింగ్ నిర్వహించే అవకాశం కల్పించే ప్రాజెక్టు ఇదేనని ఆయన తెలిపారు. ఏడాదికి 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. ఈ బొగ్గు బ్లాక్‌లో జీ–9 గ్రేడ్ నాణ్యమైన బొగ్గు లభిస్తుందని, దీని ద్వారా విద్యుత్ ఉత్పత్తి, పారిశ్రామిక రంగాలకు దీర్ఘకాలిక బొగ్గు భద్రత లభిస్తుందని భట్టి విక్రమార్క అన్నారు. తాడిచర్ల–2 ప్రాజెక్టు అమల్లోకి రావడం ద్వారా సుమారు 3 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. భూపాలపల్లి ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఇది కీలకంగా మారడంతో పాటు రహదారులు, రైల్వే వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ నిర్దేశించుకున్న 100 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడంలో తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ కీలక పాత్ర పోషిస్తుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మిగిలిన బొగ్గు బ్లాకులను కూడా సింగరేణికే కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.