Take a fresh look at your lifestyle.

భద్రాద్రి జిల్లా ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

0 1

భద్రాద్రి జిల్లా ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
వీఐపీ సంస్కృతికి భిన్నంగా వినూత్న నిర్ణయం. మాజీ సైనికుడి చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, ఆగస్టు 15: దేశ రక్షణలో సేవలందించిన మాజీ సైనికుడిని గౌరవిస్తూ భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ప్రెస్ క్లబ్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. సాధారణంగా వీఐపీలకు ప్రాధాన్యం ఇచ్చే సంప్రదాయానికి భిన్నంగా దేశ రక్షణ కోసం సేవలందించిన మాజీ ఆర్మీ అధికారి, సింగరేణి కార్మికుడి కుమారుడు వేముల సతీష్ కుమార్ చేతుల మీదుగా శనివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరింపజేశారు. త్రివిధ దళాల్లో పనిచేసే అవకాశం పొందిన సతీష్ కుమార్ మెరైన్ కమాండో ఫోర్స్‌లో సేవలందించారు. తెలంగాణ నుంచి మెరైన్ కమాండో ఫోర్స్‌లో సేవలందించిన నలుగురిలో కొత్తగూడెం జిల్లాకు చెందిన ఏకైక వ్యక్తి సతీష్ కుమార్ కావడం జిల్లాకు గర్వకారణమని విలేఖరులు పేర్కొన్నారు. పలు కీలక సైనిక ఆపరేషన్లలో పాల్గొన్న ఆయన, దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వ్యక్తిగత భద్రతా బృందంలోనూ సేవలందించారు. ముంబై తాజ్ హోటల్‌పై జరిగిన ఉగ్రదాడి అనంతరం ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను పట్టుకున్న ఆపరేషన్‌లో పాల్గొన్న బృందంలోనూ సతీష్ ఉన్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య వేడుకలకు మాజీ సైనికుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి, ఆయన చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఎగురవేయించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు త్యాగాలు చేశారని, స్వాతంత్ర్యం అనంతరం దేశ సరిహద్దులను కాపాడేందుకు సైనికులు నిరంతరం సేవలందిస్తున్నారని విలేఖరులు పేర్కొన్నారు. దేశ రక్షణలో సేవలందించిన సైనికుడి చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా సైనిక సేవలకు గౌరవం తెలిపామని అన్నారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి, దేశ రక్షణలో సేవలందిస్తున్న సైనికులతో పాటు అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు లోగాని శ్రీనివాస్, మోటమర్రి రామకృష్ణ, వెలుగు స్టాఫ్ రిపోర్టర్ పోతు రాజేందర్, సాక్షి స్టాఫ్ రిపోర్టర్ కృష్ణ గోవింద్, జనం సాక్షి స్టాఫ్ రిపోర్టర్ ఇమంది ఉదయ్ కుమార్, తెలంగాణ వాణి స్టాఫ్ రిపోర్టర్ అఫ్జల్ పఠాన్, విలేకరులు ఎర్ర ఈశ్వర్, జునుమాల రమేష్, కృష్ణారావు, కలాం, కృష్ణంరాజు, రేష్వంత్ పండుగ, రామకృష్ణ, దశరథ్ రజువా, ప్రభాకర్ రెడ్డి, రాజేష్, హుస్సేన్, చాంద్, లింగయ్య, జంపన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.