సింగరేణిలో 17 ఏళ్ల తర్వాత కార్మికులకు భారీ అగ్రిమెంట్.
పెర్క్స్ ఆదాయపు పన్ను రీఫండ్ నుంచి 24 డిమాండ్ల పరిష్కారం వరకు.. ఏఐటీయూసీ ఘన విజయం: కొరిమి రాజ్‌కుమార్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భూపాలపల్లి, ఆగస్టు 30: సుమారు 17 ఏళ్ల తర్వాత సింగరేణి కార్మిక వర్గానికి భారీ ప్రయోజనాలు కల్పించేలా అగ్రిమెంట్ సాధించామని ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ తెలిపారు. ఆదివారం భూపాలపల్లిలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్మికుల ఆర్థిక, ఉద్యోగ, వైద్య, విద్య, సంక్షేమ సమస్యలకు సంబంధించి మొత్తం 24 అంశాలపై యాజమాన్యంతో సానుకూల ఒప్పందాలు కుదిరాయని తెలిపారు.
పెర్క్స్ ట్యాక్స్ రీఫండ్ చారిత్రాత్మక విజయం:
2009లో తొమ్మిదో వేతన ఒప్పందం సమయంలో బొగ్గు గని కార్మికులకు పెర్క్స్‌పై చెల్లించిన ఆదాయపు పన్నును రీఫండ్ చేసే విధానం అమల్లోకి వచ్చిందని రాజ్‌కుమార్ తెలిపారు. అప్పటి నుంచి ఏఐటీయూసీ ఈ హక్కు కోసం పోరాడుతూ వచ్చిందన్నారు. తాజా అగ్రిమెంట్‌తో పెర్క్స్‌పై ఆదాయపు పన్ను రీఫండ్ సాధించామని, దీనివల్ల ఒక్కో కార్మికుడికి సంవత్సరానికి కనీసం రూ.35 వేలకుపైగా ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ మొత్తాలు 2027 ఏప్రిల్‌లో రీఫండ్ రూపంలో కార్మికుల ఖాతాల్లో జమ అవుతాయని పేర్కొన్నారు.
సహజ మరణాల కుటుంబాలకు రూ.20 లక్షల అదనపు ప్రయోజనం:
సహజ మరణం, అనారోగ్య కారణాలతో కార్మికులు మృతి చెందినప్పుడు వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని రాజ్‌కుమార్ తెలిపారు. ఏఐటీయూసీ పోరాటం, ఒత్తిడి ఫలితంగా గతంలో ప్రమాదాలు, మరణాలకు సంబంధించి రూ.కోటి నుంచి రూ.1.30 కోట్ల వరకు పరిహారం అందేలా చర్యలు జరిగాయని చెప్పారు. ఇక సహజ మరణాల కుటుంబాలకు అదనంగా రూ.20 లక్షలు అందించేలా యాజమాన్యం అంగీకరించిందన్నారు. కార్మికుల తరఫున రూ.5 లక్షలు, యాజమాన్యం తరఫున రూ.5 లక్షలు చొప్పున రెండు మ్యాచింగ్ గ్రాంట్ల ద్వారా ఈ మొత్తాన్ని సమకూర్చే విధానం ఉంటుందని వివరించారు. బ్యాంకుల సహకారంతో రూ.20 లక్షలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చిందన్నారు.
లాభాల వాటా 40 శాతానికి డిమాండ్:
కార్మికులకు నేరుగా ఆర్థిక ప్రయోజనం చేకూర్చే లాభాల వాటాను 40 శాతానికి పెంచాలని ఈసారి డిమాండ్ చేస్తున్నట్లు రాజ్‌కుమార్ తెలిపారు. 1999–2000లో ఏఐటీయూసీ పోరాటంతో లాభాల వాటా ప్రారంభమైందని, గతంలో 10 శాతంగా ఉన్న వాటా గత ఏడాది 34 శాతానికి చేరిందని చెప్పారు. ఈ ఏడాది 40 శాతం లాభాల వాటా కోసం యాజమాన్యం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, దసరాకు కార్మికులకు లాభాల వాటా అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మారు పేర్ల సమస్యకు ఏడుగురు సభ్యుల కమిటీ:
కార్మికుల దీర్ఘకాలిక సమస్య అయిన మారు పేర్ల సమస్య పరిష్కారానికి ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యాజమాన్యం తరఫున నలుగురు, ఏఐటీయూసీ నుంచి ఇద్దరు, ఐఎన్‌టీయూసీ నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారని, నెల రోజుల్లో సమస్యను పరిష్కరించేలా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అర్హులైన కార్మికులందరికీ ఈ నిర్ణయంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
మృతుల పిల్లలకు సూటబుల్ ఎంప్లాయ్‌మెంట్:
మైన్‌లో మృతి చెందిన కార్మికుల పిల్లలకు వారి విద్యార్హతలకు అనుగుణంగా సూటబుల్ ఎంప్లాయ్‌మెంట్ కల్పించే విధానాన్ని కొనసాగించేందుకు ఒప్పందం కుదిరిందని రాజ్‌కుమార్ తెలిపారు. డిప్లొమా, డిగ్రీ తదితర అర్హతలను బట్టి ఉద్యోగాలు కల్పించడంతోపాటు, అండర్‌గ్రౌండ్‌లో పనిచేయడానికి అనర్హత పొందిన మైనింగ్ స్టాఫ్, ఈఅండ్‌ఎం, ఎలక్ట్రిషియన్లు, ఫిట్టర్లు తదితర సిబ్బందికి సర్ఫేస్‌లోని ఖాళీల్లో అవకాశం కల్పించేందుకు అంగీకారం కుదిరిందన్నారు.
ఉన్నత విద్యకు ఎన్‌ఓసీ సమస్యకు పరిష్కారం:
కార్మికులు ఉన్నత విద్య అభ్యసించేందుకు 2012 నుంచి పెండింగ్‌లో ఉన్న ఎన్‌ఓసీ సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. రామగుండం జేఎన్‌టీయూ, కొత్తగూడెం, పాల్వంచ తదితర ప్రాంతాల్లో ఈవెనింగ్ కాలేజీల్లో చదివిన, ఇన్-సర్వీస్‌లో ఉన్నత విద్య అభ్యసించిన కార్మికులకు ఈ నిర్ణయం ఊరటనిస్తుందని చెప్పారు.
కట్ చేసిన ఇంక్రిమెంట్ల పునరుద్ధరణకు కృషి:
ప్రమాదాలకు బాధ్యులుగా నిర్ధారించి ఏళ్ల తరబడి ఇంక్రిమెంట్లు కోల్పోయిన కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు రాజ్‌కుమార్ తెలిపారు. 10, 15, 20 ఏళ్లుగా ఇంక్రిమెంట్ కట్ అవుతున్న ఉద్యోగుల పెన్షన్‌పై కూడా ప్రభావం పడుతోందన్నారు. బాధితులు ఏఐటీయూసీ కార్యాలయాలకు దరఖాస్తులు అందజేస్తే యాజమాన్యంతో చర్చించి ఇంక్రిమెంట్ల పునరుద్ధరణకు కృషి చేస్తామని తెలిపారు.
క్యాడర్ స్కీమ్‌లు, ఉద్యోగ పరీక్షలకు అంగీకారం:
ఎస్‌డీఎల్ ఆపరేటర్లు, సర్వేయర్లు, క్లర్కులు, జూనియర్ ఫారెస్ట్ అసిస్టెంట్ తదితర కేటగిరీలకు సంబంధించిన పెండింగ్ క్యాడర్ స్కీమ్‌లను అమలు చేసేందుకు యాజమాన్యం అంగీకరించిందన్నారు. 2023లో క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించినప్పటికీ పరీక్ష నిర్వహించలేదని, సెక్యూరిటీ గార్డులు, పారామెడికల్, నర్సింగ్ సిబ్బంది నియామకాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రెండు నెలల్లో పరీక్షలు నిర్వహించేందుకు యాజమాన్యం అంగీకరించిందన్నారు.
రిఫరల్ వైద్య ఖర్చు కంపెనీయే భరించాలి:
ప్రస్తుతం మెడికల్ అటెండెన్స్ నిబంధనల కారణంగా రిఫరల్ వైద్యంలో నిమ్స్ టారిఫ్ కంటే అదనంగా అయ్యే ఖర్చును కార్మికులే భరించాల్సి వస్తోందని రాజ్‌కుమార్ తెలిపారు. రిఫరల్ చేసిన కార్మికుడి పూర్తి వైద్య ఖర్చును కంపెనీయే భరించేలా నిబంధనలు మార్చాలని డిమాండ్ చేశామని, దీనిపై కమిటీ ఏర్పాటు చేసి 15–20 రోజుల్లో నిర్ణయం తీసుకునేందుకు యాజమాన్యం అంగీకరించిందని చెప్పారు.
కాంట్రాక్ట్ కార్మికులకు పలు ప్రయోజనాలు:
కాంట్రాక్ట్ కార్మికుల హైపవర్ వేతనాల పెంపుపై అధ్యయనం చేస్తామని యాజమాన్యం తెలిపిందన్నారు. వైద్య సదుపాయాలపై కూడా సానుకూలంగా స్పందించిందని చెప్పారు. సింగరేణి విద్యాసంస్థల్లో కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలు చదివితే విద్యా ఖర్చులను ఉచితంగా అందించాలన్న డిమాండ్‌కు అంగీకారం లభించిందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి విద్యాసంస్థల్లో చదివిన కాంట్రాక్ట్ కార్మికుల పిల్లల విద్యా ఖర్చులను రీఫండ్ చేయడానికి యాజమాన్యం ఒప్పుకుందని, మొత్తం సుమారు రూ.15 లక్షలు వారి ఖాతాల్లో జమ కానున్నాయని తెలిపారు.
సీనియర్ మైనింగ్ సర్దార్లకు ప్రమోషన్లు:
సీనియర్ మైనింగ్ సర్దార్ల దీర్ఘకాలిక సమస్యపై కూడా పరిష్కారం సాధించామని రాజ్‌కుమార్ తెలిపారు. అర్హత కలిగిన వారికి బ్యాక్‌డేట్ నుంచి ప్రయోజనం కల్పిస్తూ ఓవర్‌మెన్‌గా ప్రమోషన్ ఇవ్వడానికి వన్‌టైమ్ సెటిల్‌మెంట్ విధానంలో అంగీకారం కుదిరిందన్నారు.
సింగరేణి పాఠశాలల్లో నాణ్యమైన విద్య:
సింగరేణి కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు సింగరేణి పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశామని తెలిపారు. సుమారు 18 వేల మంది కార్మికుల పిల్లలు ఉన్నారని, ప్రైవేట్ విద్య కోసం కార్మికులు భారీగా ఖర్చు చేస్తున్నారని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భూపాలపల్లి, శ్రీరాంపూర్, కొత్తగూడెంలో ఒక్కో పాఠశాల ప్రారంభించేందుకు యాజమాన్యం అంగీకరించిందన్నారు.
రిటైర్డ్ కార్మికుల వైద్య పరిమితి పెంపు:
రిటైర్డ్ కార్మికులకు ప్రస్తుతం ఉన్న రూ.8 లక్షల సీపీఆర్‌ఎంఎస్ వైద్య పరిమితి సరిపోవడం లేదని రాజ్‌కుమార్ తెలిపారు. తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ఈ మొత్తం త్వరగా ఖర్చవుతోందన్నారు. రిటైర్డ్ కార్మికులు, వారి జీవిత భాగస్వాములకు అవసరమైన వైద్య చికిత్సను కంపెనీ భరించేలా చర్యలు తీసుకోవాలని కోరామని, దీనికి యాజమాన్యం హామీ ఇచ్చిందన్నారు.
ఓన్ హౌస్ స్కీమ్ పునరుద్ధరణ:
కార్మికుల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ఓన్ హౌస్ స్కీమ్‌ను అమలు చేయాలని కోరామని తెలిపారు. భూపాలపల్లిలో వెయ్యి క్వార్టర్లకు అనుమతి ఉందని, నగర్‌లో 100 ఎకరాల భూమిని తీసుకుని ఒక్కో కార్మికుడికి 200 గజాల చొప్పున ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించిందన్నారు. ఇతర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు అమలు చేస్తున్న గృహ నిర్మాణ విధానాలను పరిశీలించి సింగరేణిలోనూ అమలు చేయాలని కోరినట్లు చెప్పారు.
కొత్త గనుల కోసం పోరాటం కొనసాగిస్తాం:
సింగరేణి భవిష్యత్తు కోసం కొత్త గనుల సాధన అత్యంత కీలకమని రాజ్‌కుమార్ అన్నారు. వీఎస్‌కే ఓపెన్ స్ట్రక్చర్ డీప్‌సైడ్ బ్లాక్, తాడిచర్ల-2 బ్లాకులను సాధించామని, రానున్న రోజుల్లో కోయగూడెం-3, శ్రావణపల్లి, మందమర్రి తదితర ప్రాంతాల్లో కొత్త గనుల సాధనకు యూనియన్ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. తాజా ఒప్పందంతో కార్మికులకు నేరుగా ఆర్థిక, ఉద్యోగ, వైద్య, విద్యా ప్రయోజనాలు చేకూరేలా అనేక నిర్ణయాలు సాధించామని రాజ్‌కుమార్ పేర్కొన్నారు. కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒప్పందంలో కుదిరిన అంశాలను త్వరితగతిన అమలు చేయించేందుకు ఏఐటీయూసీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో భూపాలపల్లి ఏరియా ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీలు సుధాకర్ రెడ్డి, జి. శ్రీనివాస్, తాళ్ల పోషయంతో పాటు అన్ని గనులు, డిపార్ట్మెంట్ల పిట్ సెక్రటరీలు, నాయకులు పాల్గొన్నారు.