Take a fresh look at your lifestyle.

సింగరేణిలో ఐఎన్‌టీయూసీ విస్తృత స్థాయి సమావేశాలు.

0 5

సింగరేణిలో ఐఎన్‌టీయూసీ విస్తృత స్థాయి సమావేశాలు.
అన్ని ఏరియాల పిట్‌ సెక్రటరీల నుంచి మహిళా ప్రతినిధుల వరకు. మూడు రోజులపాటు కీలక సమావేశాలు.
యూనియన్ భవిష్యత్‌ కార్యాచరణపై ప్రత్యేక దృష్టి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, ఆగస్టు 30: సింగరేణి కోల్‌ మైన్స్‌ లేబర్‌ యూనియన్‌–ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి పరిధిలోని కార్మిక సంఘం నాయకులు, బాధ్యులు, ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు యూనియన్‌ ప్రకటించింది. ఈ నెల సెప్టెంబర్‌ 6న ఉదయం 10 గంటలకు గోదావరిఖనిలోని సాయి లీలా బ్యాంక్వెట్‌ హాల్‌లో బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌, ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3, భూపాలపల్లి ఏడు ఏరియాలకు చెందిన పిట్‌ సెక్రటరీల ముఖ్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్‌ డా. బి. జనక్‌ ప్రసాద్‌ హాజరై కార్మిక సంఘానికి సంబంధించిన పలు అంశాలపై సూచనలు, సలహాలు అందించడంతోపాటు భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. సెంట్రల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్లు, సెంట్రల్‌ జనరల్‌ సెక్రటరీలు, వైస్‌ ప్రెసిడెంట్లు, చీఫ్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీలు, ఏడు ఏరియాల వైస్‌ ప్రెసిడెంట్లు, గనులు, ఓసీపీలు, వివిధ విభాగాల పిట్‌ సెక్రటరీలు, బ్రాంచ్‌ సెక్రటరీలు తప్పనిసరిగా హాజరు కావాలని యూనియన్‌ కోరింది. అదేవిధంగా సెప్టెంబర్‌ 8న సాయంత్రం 4 గంటలకు కొత్తగూడెంలో కొత్తగూడెం, కార్పొరేట్‌, మణుగూరు, ఎల్లందు, సత్తుపల్లి ఐదు ఏరియాల నాయకులు, బాధ్యులు, ప్రతినిధులతో ప్రాంతీయ స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్‌ 9న సాయంత్రం 4 గంటలకు కొత్తగూడెంలో సింగరేణి పరిధిలోని అన్ని ఏరియాల మహిళా నాయకులు, ప్రతినిధులతో ప్రత్యేక మహిళా సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొంది. అన్ని ఏరియాల మహిళా ప్రతినిధులు తప్పనిసరిగా హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని యూనియన్‌ విజ్ఞప్తి చేసింది.

కార్మిక సమస్యలపై నివేదికలు తీసుకురావాలి:

ఏరియా వైస్‌ ప్రెసిడెంట్లు తమ పరిధిలోని గనులు, ఓసీపీలు, వివిధ విభాగాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ముందుగానే నోట్‌ చేసుకుని సమావేశాలకు తీసుకురావాలని ఐఎన్‌టీయూసీ సూచించింది. సమావేశాల్లో ఆయా సమస్యలపై సమగ్రంగా చర్చించి, వాటి పరిష్కారానికి అవసరమైన భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నట్లు యూనియన్‌ వెల్లడించింది. కాగా సింగరేణిలో గుర్తింపు ఎన్నికల కాల పరిమితి త్వరలో ముగుస్తుండటంతో ఈ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.