కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తాం : జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి.
సింగరేణి భూపాలపల్లి ఏరియాలో ప్రాతినిధ్య సంఘంతో స్ట్రక్చర్ కమిటీ సమావేశం.
కార్మిక సమస్యల పరిష్కారం, భద్రతా ప్రమాణాల మెరుగుదలపై ఐఎన్టీయూసీ డిమాండ్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 29:ఉద్యోగుల సంక్షేమం, భద్రతతో పాటు సంస్థ అభివృద్ధే యాజమాన్యానికి ప్రధాన లక్ష్యాలని, ఐఎన్టీయూసీ ప్రతినిధులు ప్రస్తావించిన ప్రతి సమస్యను సానుకూల దృక్పథంతో పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సింగరేణి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య పరస్పర అవగాహన, సమన్వయం, సహకారంతో పనిచేస్తే సంస్థ మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం ప్రాతినిధ్య కార్మిక సంఘం ఐఎన్టీయూసీ ప్రతినిధులతో స్ట్రక్చర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంక్షేమం, గనుల భద్రత, పని పరిస్థితుల మెరుగుదల, మౌలిక వసతులు, వైద్య సేవలకు సంబంధించిన పలు సమస్యలు, సూచనలను ఐఎన్టీయూసీ ప్రతినిధులు యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. అన్ని గనులు, విభాగాల్లోని క్యాంటీన్లకు 2018 సర్క్యులర్ ప్రకారం బడ్జెట్ కేటాయిస్తున్నారని, ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా క్యాంటీన్ బడ్జెట్‌ను పెంచాలని కోరారు. గనుల్లో ఉత్పత్తికి అవసరమైన డ్రిల్ బిట్స్, డ్రిల్ రాడ్స్‌తో పాటు కార్మికుల రక్షణకు అవసరమైన షూస్, హెల్మెట్లను తగినంతగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కేటీకే–1 ఇంక్లైన్కు వెళ్లే మార్గంలో లైటింగ్‌ను మెరుగుపరచడంతో పాటు రహదారిపై ఉన్న గుంతలకు మరమ్మతులు చేపట్టాలని, ఏరియా ఆసుపత్రి చౌరస్తా నుంచి కేటీకే–8 ఇంక్లైన్ వరకు రహదారిపై లైటింగ్ మెరుగుపరిచి గుంతలను పూడ్చాలని కోరారు. కేటీకే–8 ఇంక్లైన్లో మ్యాన్‌రైడింగ్ టైర్లు తక్కువగా ఉన్నందున వాటి సంఖ్యను పెంచడంతో పాటు అవసరమైన స్పేర్ పార్ట్స్‌ను తగినంతగా అందుబాటులో ఉంచాలని ఐఎన్టీయూసీ ప్రతినిధులు కోరారు. భూపాలపల్లి ఏరియాలోని అన్ని సింగరేణి కాలనీల్లో దోమల మందు పిచికారీ చేయించాలని, వీధి దీపాలను మెరుగుపరచాలని, అన్ని గనుల్లో ఉద్యోగుల పెట్టెల షెడ్లు, బైక్ షెడ్లకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కేటీకే–ఓసీపీ–2 ప్రాజెక్టు క్వారీలో బ్లాస్టింగ్ కోసం బూస్టర్లు, నాజిల్స్, పూర్తీలు తదితర పేలుడు పదార్థాలను ఒకే ఎక్స్‌ప్లోజివ్ వ్యాన్‌లో తరలిస్తున్నారని, దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ మరో ఎక్స్‌ప్లోజివ్ వ్యాన్‌ను సమకూర్చాలని డిమాండ్ చేశారు. అలాగే భూపాలపల్లి ఏరియాలోని అన్ని గనులకు అందుబాటులో ఉన్న అంబులెన్స్‌లలో ఉద్యోగులు గని నుంచి ఆసుపత్రికి చేరేలోపు అత్యవసర చికిత్స అందించేందుకు అవసరమైన మెడికల్ ఎక్విప్మెంట్ను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని కోరారు. యూనియన్ ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలపై సంబంధిత విభాగాల అధికారులు స్పందిస్తూ పరిష్కరించగల అంశాలపై తక్షణ చర్యలు చేపడతామని తెలిపారు. విధానపరమైన అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఓటుజీఎం డి.శ్యామ్‌సుందర్, ఏసీఎంవో డాక్టర్ పద్మజ, ఏజీఎం (సివిల్) రవికుమార్, ఏజీఎం (ఐఈడీ) జ్యోతి, కేటీకే–1 గ్రూప్ ఏజెంట్ ములుకుంట్ల తిరుపతి, పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యామ్‌సుందర్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. కాగా ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టీయూసీ నుండి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బి. మధుకర్ రెడ్డి, స్ట్రక్చర్ కమిటీ సభ్యులు హుస్సేన్, బొడ్డు అశోక్, ఏరియా విభాగాధిపతులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.