
ఉద్యోగుల ఆరోగ్యం, ఉత్సాహానికి క్రీడలు దోహదం.
మహిళా ఉద్యోగులు క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలి : ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి.
భూపాలపల్లి ఏరియాలో ఉత్సాహంగా కబడ్డీ పోటీలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 1: ఉద్యోగుల ఆరోగ్యం, ఉత్సాహం, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని సింగరేణి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మహిళా ఉద్యోగులు కూడా క్రీడల్లో చురుగ్గా పాల్గొని తమ ప్రతిభను చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు శాఖాపరమైన క్రీడా పోటీలు మంచి వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. సింగరేణి భూపాలపల్లి ఏరియాలో వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి నిర్వహిస్తున్న శాఖాపరమైన క్రీడా పోటీల్లో భాగంగా మంగళవారం కబడ్డీ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని కబడ్డీ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణతో పోటీల్లో పాల్గొనాలని క్రీడాకారులకు సూచించారు. క్రీడల ద్వారా ఉద్యోగుల్లో ఐక్యత, స్నేహభావం, జట్టు స్ఫూర్తి మరింత పెంపొందుతాయని అన్నారు. మహిళా ఉద్యోగుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఏజీఎం (సివిల్) రవికుమార్, పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యాంసుందర్, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోట పలుకుల రమేష్, ప్రాతినిధ్య సంఘం ఐఎన్‌టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు బేతెల్లి మధూకర్‌రెడ్డి, సిఎంఓఏఐ ఏరియా అధ్యక్షుడు నజీర్, క్రీడల గౌరవ కార్యదర్శి సాయికృష్ణ, స్పోర్ట్స్ సూపర్‌వైజర్ పర్స శ్రీనివాస్, కోఆర్డినేటర్ నాగేశ్వర్‌రావుతో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.