అక్షిత రాణి కేసును ఛేదించిన గోదావరిఖని పోలీసులు : ప్రేమ, ఈర్ష్యే హత్యకు కారణం.. పురుగుల మందు బలవంతంగా తాగించి హత్య.
అక్షిత రాణి కేసును ఛేదించిన గోదావరిఖని పోలీసులు.
ప్రేమ, ఈర్ష్యే హత్యకు కారణం.. పురుగుల మందు బలవంతంగా తాగించి హత్య.
సీసీ కెమెరాలు, కాల్‌డేటా ఆధారంగా నిందితుల అరెస్ట్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని టౌన్, సెప్టెంబర్ 20: గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన అక్షిత రాణి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ, ఈర్ష్య నేపథ్యంలో అక్షిత రాణిని హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు ప్రధాన నిందితుడు జెట్టి నవీన్‌కుమార్‌ను, మరో నిందితుడు బొమ్మకంటి రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరా దృశ్యాలు, కాల్‌డేటా, కాల్ రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించి కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. ఏసీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం గోదావరిఖని బ్రిడ్జి, గంగానగర్ ప్రాంతంలో సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న జెట్టి నవీన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. సింగరేణి సంస్థలో ఓవర్‌మన్‌గా పనిచేస్తున్న బొమ్మకంటి రవికుమార్‌ను ఓసీపీ-5 గని వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 12న గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్షిత రాణి అనుమానాస్పద స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందడంతో కేసు నమోదైంది. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, పెద్దపల్లి డీసీపీ పర్యవేక్షణలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ, కాల్‌డేటా, కాల్ రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాలను సమగ్రంగా పరిశీలించడంతో నిందితుల కదలికలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు నవీన్‌కుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. 2022లో సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న సమయంలో అక్షిత రాణితో అతడికి పరిచయం ఏర్పడి, అనంతరం సన్నిహిత సంబంధంగా మారినట్లు పేర్కొన్నారు. అక్షిత రాణి డిప్లొమా పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీటెక్ మైనింగ్ చదువుతున్న సమయంలో శిక్షణ కోసం గోదావరిఖనికి వచ్చింది. ఈ సమయంలో ఆమెకు సింగరేణిలో ఓవర్‌మన్‌గా పనిచేస్తున్న రవికుమార్‌తో పరిచయం ఏర్పడింది. అక్షిత రాణి తనకు దూరంగా ఉంటూ రవికుమార్‌తో సన్నిహితంగా మెలగడాన్ని నవీన్‌కుమార్ తట్టుకోలేకపోయాడని, దీంతో ఆమెపై ఈర్ష్య, ఆగ్రహం పెంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో ఈ నెల 12న పురుగుల మందును నీటి సీసాలో నింపుకుని కారులో ఉంచుకున్న నవీన్‌కుమార్.. విధులు ముగించుకుని ఆటోలో వెళ్తున్న అక్షిత రాణిని ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్స్ వద్ద కారులో ఎక్కించుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఎన్టీపీసీ, ఎఫ్‌సీఎల్, ఐఓసీ ప్రాంతాల్లో కారులో తిప్పుతూ ఆమెతో వాగ్వాదానికి దిగినట్లు పేర్కొన్నారు. రవికుమార్ తనపై అత్యాచారం చేశాడని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అక్షిత రాణితో సూసైడ్ నోట్ రాయించినట్లు, దానిని ఆమె ఫోన్‌తో ఫొటో తీసిన అనంతరం ముందుగానే సిద్ధం చేసుకున్న పురుగుల మందును బలవంతంగా తాగించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. పురుగుల మందు తాగిన అక్షిత రాణి కారులోనే స్పృహ కోల్పోయినప్పటికీ వెంటనే ఆసుపత్రికి తరలించకుండా నవీన్‌కుమార్ జాప్యం చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె మొబైల్ నుంచి తండ్రికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు. రాత్రి సుమారు 7.30 నుంచి 7.45 గంటల మధ్య అక్షిత రాణిని ఇంటికి తీసుకెళ్లి, ఆమె తల్లిదండ్రులను కూడా కారులో ఎక్కించుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడన్నారు. ఆసుపత్రికి చేరుకున్న అనంతరం నవీన్‌కుమార్ అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు అక్షిత రాణి మృతి చెందినట్లు వెల్లడించారు. అక్షిత రాణి మృతితో నేరం బయటపడుతుందనే భయంతో నవీన్‌కుమార్ నేరానికి ఉపయోగించిన కారును కడిగి, సూసైడ్ నోట్, పురుగుల మందు సీసా, మొబైల్ సిమ్ కార్డులను తొలగించి ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం హైదరాబాద్‌కు పారిపోయినట్లు గుర్తించారు. అయితే సీసీ కెమెరా దృశ్యాలు, కాల్‌డేటా, కాల్ రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా అతడి కదలికలను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన ఎకోస్పోర్ట్ కారు, రెండు సెల్ఫోన్లు, ఒక ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బొమ్మకంటి రవికుమార్‌పై వచ్చిన ఆరోపణలపైనా దర్యాప్తు కొనసాగుతోంది. శిక్షణ నిమిత్తం గోదావరిఖనికి వచ్చిన సమయంలో అక్షిత రాణితో రవికుమార్‌కు పరిచయం ఏర్పడి, ఆమె ఇష్టానికి విరుద్ధంగా శారీరక సంబంధానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అక్షిత రాణి సింగరేణి అధికారులకు సమర్పించిన దరఖాస్తు, దానిపై తీసుకున్న చర్యలు, సింగరేణి అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించిన ఆరోపణలు, రవికుమార్‌పై వచ్చిన ఇతర ఆరోపణలపైనా విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుల వివరాలు:
ఎ-1 జెట్టి నవీన్‌కుమార్ (38): తండ్రి కొమురయ్య. సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాల, సీసీసీ నస్పూర్‌లో కాంట్రాక్ట్ అధ్యాపకుడు. గారెపల్లి గ్రామం, సుల్తానాబాద్ మండలానికి చెందినవాడు.
ఎ-2 బొమ్మకంటి రవికుమార్ (35): తండ్రి సత్తయ్య. ఆర్జీ-1 పరిధిలోని జీడీకే 2, 2ఏ ఇన్‌క్లైన్ గనిలో ఓవర్‌మన్‌గా పనిచేస్తున్నాడు. బుద్ధ ఖుర్ద్, బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లాకు చెందినవాడు.
కేసులో ఇప్పటివరకు సేకరించిన సాంకేతిక, ఇతర ఆధారాల ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.