Take a fresh look at your lifestyle.

సింగరేణిలో ఎన్నికలు జరిగే వరకు జేబీసీసీఐ సంఘాలతో చర్చలు జరపాలి : బిఎంఎస్.

0 8

ఎన్నికలు జరిగే వరకు జేబీసీసీఐ సంఘాలతో చర్చలు జరపాలి.
సింగరేణి లాభాల్లో 40 శాతం వాటా చెల్లించాలి.
డైరెక్టర్‌ (పా) గౌతమ్‌ పోట్రుకు ఎస్‌సీఎంకేఎస్‌-బీఎంఎస్‌ వినతిపత్రం.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగే వరకు అన్ని జాతీయ కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించి, జేబీసీసీఐలో భాగస్వామ్యమైన సంఘాలతో కార్మిక సమస్యలపై చర్చలు కొనసాగించాలని సింగరేణి కోల్‌ మైన్స్‌ కార్మిక సంఘ్‌ (ఎస్‌సీఎంకేఎస్‌)-బీఎంఎస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సంస్థ డైరెక్టర్‌ (పర్సనల్‌ , అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ వెల్ఫేర్) గౌతమ్‌ పోట్రును కలిసి ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. గుర్తింపు సంఘం ఎన్నికల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో కొత్త ఎన్నికలు నిర్వహించే వరకు కార్మిక సంఘాల మధ్య సమాన అవకాశాలు ఉండాలని బీఎంఎస్‌ ప్రతినిధులు కోరారు. కార్మికులకు సంబంధించిన చర్చలు, కమిటీలు, నిర్ణయ ప్రక్రియల్లో అన్ని జాతీయ కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కార్మిక సమస్యల పరిష్కార ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు అన్ని సంఘాలను భాగస్వామ్యం చేయడం అవసరమని వారు పేర్కొన్నారు. మరో ప్రధాన డిమాండ్‌గా 2025-26 ఆర్థిక సంవత్సరానికి కార్మికులకు 40 శాతం ప్రాఫిట్‌ షేర్‌ను ప్రకటించి తక్షణమే చెల్లించాలని బీఎంఎస్‌ కోరింది. సంస్థ లాభాల్లో కార్మికుల భాగస్వామ్యానికి సంబంధించిన ఈ అంశంపై యాజమాన్యం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ప్రతినిధులు కోరినట్లు తెలిపారు. అదేవిధంగా సింగరేణిలో పెండింగ్‌లో ఉన్న కార్మిక, సంక్షేమ సమస్యలతో పాటు పదోన్నతులు, బదిలీలు, సిబ్బంది కొరత, ఇతర పరిపాలనా అంశాలను కూడా అత్యవసరంగా పరిష్కరించాలని డైరెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కార్మిక సమస్యలపై చర్చలు నిరంతరం కొనసాగితే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను త్వరగా గుర్తించి పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు. ప్రతినిధి బృందం వినతిపత్రంలోని అంశాలను డైరెక్టర్‌ గౌతమ్‌ పోట్రు సానుకూలంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బీఎంఎస్‌ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కోల్‌ మైన్స్‌ కార్మిక సంఘ్‌ (బీఎంఎస్‌) అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి కుమారస్వామి, కేంద్ర కోశాధికారి సాయవేన సతీష్‌, నాయకులు వంశీ, లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.