నిజామాబాద్, సెప్టెంబర్ 25 ( లోకంతీరు ) : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( పి.డి.యస్.యు ) 50 వసంతాల స్వర్ణోత్సవ సభలను జయప్రదం చేయాలని బోధన్ పట్టణంలో కొత్త బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థి ప్రదర్శన పేరుతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పి.డి.యస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎల్.అనిల్ కుమార్ లు మాట్లాడుతూ కామ్రేడ్ జార్జిరెడ్డి, జేసీఎస్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కోలాశంకర్, రంగవల్లి, చేరాలు లాంటి విద్యార్థి అమరవీరుల త్యాగాల పునాదులపై పి.డి.యస్.యు ఉద్యమం నిర్మాణమైందన్నారు. 1974 అక్టోబర్ 12, 13 తేదీల్లో హైదరాబాదులో మొదటి మహాసభలు జరుపుకున్న పి.డి.యస్.యు, ప్రస్తుతం స్వర్ణోత్సవాలు జరుపుకుంటుందన్నారు. విద్యార్థుల హక్కుల కోసం, కామన్ స్కూల్ విధానం కోసం 50 ఏళ్లుగా రాజీ లేని పోరు చేస్తున్నదన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం పోరాడుతూనే, సమాజంలోని దోపిడి పీడనలకు వ్యతిరేకంగా ఉద్యమించిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నదన్నారు. 50 సంవత్సరాల విద్యార్థి ఉద్యమాన్ని సమీక్షించుకుని, భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకొనడానికి ఈనెల 30న ఉస్మానియా యూనివర్సిటీలో భారీ ర్యాలీ నిర్వహించి, ఠాగూర్ ఆడిటోరియంలో స్వర్ణోత్సవ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభలను విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ప్రగతిశీల శక్తులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి.డి.యస్.యు మాజీ నాయకులు బి. మల్లేష్, గంగాధర్ యాదగిరి గౌడ్, పి.డి.యస్.యు జిల్లా నాయకులు మహిపాల్, మౌనిక, అంబిక, గంగ,కిషోర్,రమేష్,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.