


కుటుంబానికి పెద్దలే బలమైన వేర్లు : డైరెక్టర్ రూపా రెడ్డి.
జీవిత విలువలు, అనుభవాలు, ఆప్యాయతను అందించేది తాతయ్యలు, అమ్మమ్మ-నాన్నమ్మలే.
మేడిపల్లి బచ్ పన్ పాఠశాలలో ఘనంగా గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
మేడిపల్లి, సెప్టెంబర్ 26:జీవితంలో తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో.. విలువలు, అనుభవాలు, ఆప్యాయతను అందించే తాతయ్యలు, అమ్మమ్మ-నాన్నమ్మలు కూడా అంతే ముఖ్యమైన వారని అకాడమీ డైరెక్టర్ కె. రూపా రెడ్డి అన్నారు. కుటుంబంలో పెద్దలు ఉండటం అంటే ఆ కుటుంబానికి వేర్లు బలంగా ఉన్నట్లేనని పేర్కొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఫిర్జాధిగూడ డివిజన్ మేడిపల్లిలో ఉన్న బచ్‌పన్ ప్లే స్కూల్, అకాడమిక్ హైట్స్ పబ్లిక్ హైస్కూల్‌లో శనివారం నిర్వహించిన గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాల ప్రిన్సిపాల్ జి. అలేఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థుల గ్రాండ్ పేరెంట్స్, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రూపా రెడ్డి మాట్లాడుతూ.. తాతయ్యలు, అమ్మమ్మ-నాన్నమ్మలు కేవలం కుటుంబంలోని పెద్దలు మాత్రమే కాదని, వారు జ్ఞాపకాల భాండాగారమని, అనుభవాల పాఠశాలని, ప్రేమకు చిరునామా అని అన్నారు. వారు చెప్పే చిన్నచిన్న కథల్లో విలువైన జీవిత పాఠాలు దాగి ఉంటాయని, వారి మాటల్లో అనుభవసారం ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలు తప్పు చేసినప్పుడు మందలించినా, వారి కళ్లలో కన్నీరు కనిపిస్తే ముందుగా ఓదార్చేది పెద్దలేనని, పిల్లలు ఏదైనా సాధించినప్పుడు వారికంటే ఎక్కువగా ఆనందించేది కూడా తాతయ్యలు, అమ్మమ్మ-నాన్నమ్మ లేనని అన్నారు. ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం జీవితాన్ని ఎంతో సులభతరం చేసిందని, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, కంప్యూటర్లు ఎన్నో విషయాలను నేర్పుతున్నప్పటికీ.. జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పేది మాత్రం పెద్దల అనుభవమేనని రూపా రెడ్డి పేర్కొన్నారు. నేటి పిల్లల బాల్యం గత తరాల బాల్యంతో పోలిస్తే ఎంతో భిన్నంగా ఉందని, అప్పట్లో సౌకర్యాలు తక్కువగా ఉన్నప్పటికీ ఎన్నో కష్టాలను ఎదుర్కొని కుటుంబాలను నిలబెట్టిన గొప్ప శక్తి తమ పెద్దలదని అన్నారు. వారి త్యాగాలు, జీవిత అనుభవాలను పిల్లలు తెలుసుకుని గౌరవించాలని సూచించారు. తాతయ్యలు, అమ్మమ్మ-నాన్నమ్మలు పిల్లలకు ఇచ్చే గొప్ప బహుమతి డబ్బు, ఆస్తి కాదని.. వారి సమయం, ప్రేమ, ఆశీర్వాదమేనని రూపా రెడ్డి అన్నారు. అందువల్ల పిల్లలు పెద్దలతో కొంత సమయం గడపాలని, వారితో మాట్లాడి చిన్ననాటి కథలు, అనుభవాలు తెలుసుకోవాలని సూచించారు. కుటుంబంలో పెద్దలు ఉండటం చెట్టుకు వేర్లు బలంగా ఉండటంతో సమానమని, వారి అనుభవాలు కుటుంబ విలువలను, అనుబంధాలను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా విద్యార్థులు, వారి గ్రాండ్ పేరెంట్స్ తో కలిసి పలు ఆటవిడుపు కార్యక్రమాలను నిర్వహించారు. పెయింటింగ్, క్రాఫ్ట్స్ తయారీతో పాటు చిన్నపిల్లలకు గ్రాండ్ పేరెంట్స్ కథలు చెప్పించారు. అలాగే వారితో పాటలు పాడించడం, నృత్యాలు చేయించడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రాండ్ పేరెంట్స్ సైతం తమ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లినట్లుగా ఉత్సాహంగా పాల్గొని కేరింతలు కొట్టారు. పిల్లలతో కలిసి ఆటపాటల్లో పాల్గొంటూ సందడి చేశారు. పిల్లలు, పెద్దల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు కుటుంబ విలువలు, తరాల అనుభవాల ప్రాధాన్యతను చాటిచెప్పేలా వేడుకలు నిర్వహించడం పట్ల తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది ఆద్యంతం సమన్వయంతో పనిచేశారు.