పరిసరాల పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు రావు
– జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్



కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, ఆగస్టు 14 (లోకంతీరు): పరిసరాల పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లి లో బుధవారం కలెక్టర్ పర్యటించారు. ఇటీవల డెంగీ పాజిటివ్ వచ్చి కోలుకున్న బాధితుల ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. డెంగీ జ్వరం రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించారు. ఇండ్ల ముందున్న డ్రమ్ములలో ఎక్కువ రోజులు నీటిని నిల్వ ఉంచరాదన్నారు. మురుగు కాలువలు శుభ్రంగా ఉంచాలని, ఫాగింగ్ చేయించాలని పంచాయతీ కార్యదర్శి విజయను ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత పై గ్రామీణులకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. పరిసరాల్లో వర్షపు నీరు నీలువకుండా చూడాలన్నారు. వర్షం నీరు నిలువ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెందుతాయన్నారు.