మతోన్మాద విద్వేష శక్తుల నుండి తెలంగాణను రక్షించుకుందాం
– తెలంగాణలో మతసామరస్యాన్ని కాపాడుకుందాం
– వామపక్ష పార్టీల ఐక్య కార్యచరణ కమిటీ

నిజామాబాద్, నవంబర్ 17 ( లోకంతీరు) : ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాద, విద్వేష రాజకీయాలను వ్యతిరేకించాలని పిలుపునిస్తూ వామపక్ష పార్టీల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ సదస్సులో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కేజీ రామచందర్, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, లిబరేషన్ నాయకులు ఖాజా మొయినుద్దీన్ లు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మతం పేరుతో బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆదివాసీలపై, దళితులపై మైనారిటీలపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ దేశంలో పతనమవుతున్నదన్నారు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. శాసనసభ ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రజల మధ్య మతపరమైన విభేదాలు పెంచేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయన్నారు మెజార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయన్నారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశవాద వైఖరితో ఉంటున్నదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ బిజెపి విభజన రాజకీయాల ప్రమాదాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విస్మరిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలోని వామపక్ష పార్టీలు కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలను చైతన్యం చేయడానికి, మతసామరస్యాన్ని కాపాడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ప్రజాస్వామ్యం, పౌరహక్కులు, లౌకికత్వం, సామరస్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ఒకే తాటి మీదకు రావడానికి ప్రయత్నిస్తామన్నారు. తెలంగాణ గడ్డమీద మతోన్మాదానికి చోటు లేదని చాటి చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ పౌర సమాజం మీద ఉందన్నారు. ఆ వైపుగా ప్రజలను మరింత చైతన్యం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సీపీఐ జిల్లా నాయకులు పెద్ది వెంకట్రాములు, సీపీఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్య మరియు వామపక్ష పార్టీల నాయకులు దేవారం, సుధాకర్, నూర్జహాన్, వెంకటేష్, గంగాధర్, సాయన్న, సంధ్యారాణి, శ్రీధర్, గణేష్, విగ్నేష్, మురళి, రమేష్, కిషన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.