



సింగరేణి వ్యాప్తంగా రోడ్డెక్కిన అధికారులు: 14 రోజుల రిలే నిరాహార దీక్షలు ఉధృతం
- వేతన సవరణ, పీఆర్పీ బకాయిల చెల్లింపుకై పోరాటం
- భూపాలపల్లి, రామగుండంతో పాటు మణుగూరు, కొత్తగూడెం కార్పొరేట్ ఆఫీస్ వద్ద భారీ ఎత్తున దీక్షలు
- అధికారుల పోరాటానికి రాజకీయ నేతలు, గిరిజన ఉద్యోగుల సంఘం, హెచ్.ఎం.ఎస్ కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, జూన్ 29:
సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంస్థను లాభాల బాటలో నడిపించే అధికారులు తమ న్యాయమైన హక్కుల కోసం రోడ్డెక్కారు. భారత బొగ్గు గనుల అధికారుల సంఘం (CMOAI) కేంద్ర కార్యవర్గ మరియు కార్పొరేట్ కమిటీ పిలుపు మేరకు, సింగరేణి అధికారుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం నుండి సింగరేణి వ్యాప్తంగా 14 రోజుల రిలే నిరాహార దీక్షలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జూన్ 29 నుండి జూలై 13 వరకు సింగరేణి పరిధిలోని ప్రధాన కార్యాలయం (హెడ్ ఆఫీస్) తో పాటు అన్ని ఏరియాల జనరల్ మేనేజర్ (GM) కార్యాలయాల ఎదుట ఈ దీక్షలు కొనసాగనున్నాయి.
ప్రధాన డిమాండ్లు ఇవే:
- వేతన సవరణ (Pay Upgradation): కోల్ ఇండియాలో అమలు చేసిన విధంగానే సింగరేణి అధికారులకు కూడా పే అప్‌గ్రేడేషన్‌ను తక్షణమే అమలు చేయాలి.
- పీఆర్పీ బకాయిలు: గత మూడు సంవత్సరాలుగా (మణుగూరు పరిధిలో గత రెండేళ్లుగా) పెండింగ్‌లో ఉన్న పీఆర్పీ (Performance Related Pay) బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
- సమాన అలవెన్సులు: కోల్ ఇండియా అధికారులతో సమానంగా అన్ని అలవెన్సులు, ఇతర సేవా ప్రయోజనాలను కల్పించాలి.
- పారదర్శక పదోన్నతులు: అధికారుల పదోన్నతుల్లో పారదర్శకత పాటిస్తూ న్యాయమైన పదోన్నతి విధానాన్ని అమలు చేయాలి.
- ప్రభుత్వ బకాయిలు: ప్రభుత్వాల నుండి సింగరేణి సంస్థకు రావలసిన వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
ఏరియాల వారీగా ఉధృతంగా ప్రారంభమైన దీక్షలు:
భద్రాద్రి కొత్తగూడెం (ప్రధాన కార్యాలయం):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట సీఎంఓఏఐ కార్పొరేట్ కమిటీ ఆధ్వర్యంలో దీక్షలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దీక్షల్లో సీఎంఓఏఐ సింగరేణి శాఖ అధ్యక్షుడు టి. లక్ష్మీపతి గౌడ్, కార్పొరేట్ అధ్యక్షుడు ఎస్. వెంకటాచారి, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె. మాలతి, సీనియర్ అండర్ మేనేజర్ మాలోత్ రాంబాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తేజావత్ వీరన్న, సీనియర్ సర్వే ఆఫీసర్ కె. సర్వేశ్వరరావుతో పాటు పలువురు అధికారులు కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పే అప్‌గ్రేడేషన్ అనేది అధికారుల అత్యంత కీలకమైన, న్యాయబద్ధమైన డిమాండ్ అని, యాజమాన్యం నిర్లక్ష్యం వీడి తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
భూపాలపల్లి ఏరియా:
భూపాలపల్లి జీఎం కార్యాలయం ముందు సీఎంఓఏఐ అధ్యక్షుడు నజీర్ ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభమయ్యాయి. అన్ని విభాగాల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. ఈ దీక్షా శిబిరానికి భూపాలపల్లి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి స్వయంగా వచ్చి అధికారుల పోరాటానికి తన పూర్తి మద్దతును ప్రకటించడం విశేషం. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఎన్. సమ్మిరెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ బి. విక్రమ్, అండర్ మేనేజర్ అలీమ్, సీనియర్ అండర్ మేనేజర్ ప్రమోద్, సుశాంత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు ఏరియా:
మణుగూరు ఏరియాలో అధికారుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పెద్ద సంఖ్యలో అధికారులు దీక్షా శిబిరానికి తరలివచ్చారు. అధికారుల సంక్షేమం పట్ల యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు. మొదటి రోజు దీక్షల్లో సంఘం ముఖ్య కార్యదర్శి మదన్ నాయక్, రమణారెడ్డి, శ్రీరామ్ శంకర్, శోభన్ బాబు, సాయిల సురేష్ కుమార్, సర్వర్ నభి, కిషన్ రామ్, తోలం మధుసూదన్, డి. రమేష్ బాబు, సుదర్శన్ రెడ్డి, సీతారాం బాబు, జె. శ్రీనివాసరావు, నరసింహారావు, కృష్ణమూర్తి తదితరులు కూర్చున్నారు.
రామగుండం ఏరియా-3 & ఏపీఏ:
ఉదయం 8:40 గంటలకే జీఎం ఆఫీస్ వద్ద అధికారులు దీక్షకు కూర్చున్నారు. తొలిరోజు దీక్షల్లో అడిషనల్ మేనేజర్ కోల శ్రీనివాస్, ఎస్.ఈ ఎస్. శ్రీనివాస్, డీజీఎం చంద్రశేఖర్, డీజీఎం గాజుల షేక్ నజీర్, అడిషనల్ మేనేజర్ బొంకూరు మోహన్, పోలు సుధాకర్, కట్ల సమ్మయ్య, సర్వే ఆఫీసర్ యశోద హనుమాన్లు, ఎస్టేట్స్ ఆఫీసర్ శ్యామల, డిప్యూటీ ఫైనాన్స్ మేనేజర్ కావూరి శ్రీహర్ష, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ ఎన్. వంశీ, డిప్యూటీ సూపరింటిండెంట్ ఇంజనీర్లు ఆర్. పీతాంబర్, నల్లపు అనిల్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కొయ్యడ మనోజ్ కుమార్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమానికి జీఎం ఏపీఏ కొలిపాక నాగేశ్వర్ రావు, యాక్టింగ్ జీఎం అర్జీ-3 ఎం. రామ్మోహన్ రావు మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరై సంఘీభావం తెలిపారు.
రామగుండం ఏరియా-2:
ఉదయం 8:30 గంటలకే ఆర్జీ-2 జీఎం ఆఫీస్ ఎదుట భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. CMOAI ముఖ్య నాయకులు పెద్ది నరసింహులు (జనరల్ సెక్రటరీ, BEC), పాల నరేష్ (వైస్ ప్రెసిడెంట్, RG-2), జె. సునీత (సీనియర్ ఎస్టేట్ ఆఫీసర్), మెక్కొండ శ్రీనివాస్ (అడిషనల్ మేనేజర్), కొండి శంకరయ్య (డిప్యూటీ మేనేజర్), ఎమ్. అశ్విని (సీనియర్ ప్రోగ్రామర్) తదితరులు దీక్షా వేదికపై కూర్చున్నారు.
రాజకీయ నాయకుల సంఘీభావం:
భూపాలపల్లిలో జరుగుతున్న అధికారుల రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు సందర్శించి మద్దతు పలికారు.
- తెలంగాణ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ శ్రీ మధుసూదనా చారి గారు దీక్షా శిబిరాన్ని సందర్శించి అధికారుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.
- భూపాలపల్లి శాసనసభ్యులుశ్రీ గండ్ర సత్యనారాయణ రావు గారు దీక్షా శిబిరానికి విచ్చేసి, అధికారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
- మాజీ ఎమ్మెల్యే శ్రీ గండ్ర వెంకటరమణా రెడ్డి గారు కూడా దీక్షా క్యాంప్‌ను సందర్శించి ఆందోళన చేస్తున్న అధికారులకు మద్దతు ప్రకటించారు.
కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల భారీ మద్దతు:
- సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం: అధికారుల 14 రోజుల రిలే నిరాహార దీక్షలకు గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పూర్తి సంఘీభావాన్ని ప్రకటించింది. రాష్ట్ర అధ్యక్షులు ధరావత్ పంతులా, ప్రధాన కార్యదర్శి భూక్య నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గుగ్గులో దశరథ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వాసం భిక్షమయ్య, వైస్ ప్రెసిడెంట్ ఆంగోత్ భాస్కర్ రావు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేస్తూ, సింగరేణిలోని 11 ఏరియాల గిరిజన ఉద్యోగులు, లైజన్ ఆఫీసర్లు, ఏరియా కమిటీ సభ్యులందరూ ఈ దీక్షల్లో అధిక సంఖ్యలో పాల్గొని అధికారుల పోరాటాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
- హెచ్.ఎం.ఎస్ (HMS) ప్రతినిధి రియాజ్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు: దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి హెచ్.ఎం.ఎస్ ప్రతినిధి రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ సంస్థ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రస్తుతం సింగరేణిలో సిస్టం పూర్తిగా చెడిపోయింది. రాజకీయ నాయకుల పెత్తనం ఎక్కువైంది. లాభాల్లో నడవాల్సిన సింగరేణి కంపెనీ నేడు డెవలప్ కాకపోవడానికి కారణం… ప్రభుత్వమే ప్రభుత్వ రంగానికి (సింగరేణికి) దాదాపు 57 వేల కోట్ల రూపాయలు బాకీ ఉండడమే. నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం… రెండూ దొందు దొందే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. పాలసీలు తయారు చేసి సంస్థను నడిపించాల్సిన ఆఫీసర్లనే రోడ్డు మీదకు తెచ్చారు. మేనేజ్మెంట్ తక్షణమే అధికారులను చర్చలకు పిలిచి సమస్యను సెటిల్ చేయాలి” అని డిమాండ్ చేశారు.
స్పందించకుంటే ప్రత్యక్ష కార్యాచరణ!
అధికారుల న్యాయమైన హక్కులు సాధించే వరకు తాము వెనకడుగు వేసేది లేదని సీఎంఓఏఐ (CMOAI) నాయకులు స్పష్టం చేశారు. జూలై 13వ తేదీ వరకు ఈ రిలే నిరాహార దీక్షలు శాంతియుతంగా కొనసాగుతాయని, అయినప్పటికీ యాజమాన్యం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి, రానున్న రోజుల్లో విభాగాల వారీగా అధికారులను కలుపుకుంటూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని యాజమాన్యాన్ని హెచ్చరించారు.