Take a fresh look at your lifestyle.

ములుగు సమగ్ర అభివృద్ధి, గిరిజన సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : సీఎం రేవంత్‌రెడ్డి.

0 2

ములుగు సమగ్ర అభివృద్ధి, గిరిజన సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : సీఎం రేవంత్‌రెడ్డి.
రూ.16,007 కోట్లతో గ్రామీణ రహదారుల అభివృద్ధి ప్రణాళికకు శ్రీకారం.
రూ.63.50 కోట్లతో నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభం.
మేడారం వైభవాన్ని ప్రపంచానికి చాటేలా అభివృద్ధి.. మల్లూరు ఆలయానికి ప్రత్యేక నిధులు.
జంపన్న వాగు సమగ్ర అభివృద్ధికి చర్యలు. 
ములుగును ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి సీతక్క.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ములుగు, ఆగస్టు 16: ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధి, గిరిజనుల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం, సాగునీరు, ఉపాధి, పర్యాటక రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సమ్మక్క–సారలమ్మ వనదేవతల ఆశీస్సులతో మేడారం నుంచి ములుగు వరకు ఆదివారం ఆయన చేపట్టిన పర్యటన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వేదికగా నిలిచింది. మేడారంలో వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం.. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందజేయడంతో పాటు శుద్ధ తాగునీటి కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలో రూ.16,007 కోట్ల గ్రామీణ రహదారుల అభివృద్ధి ప్రణాళికకు శ్రీకారం చుట్టి, రూ.63.50 కోట్లతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు సుమారు రూ.868 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల పైలాన్‌ను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డితో కలిసి ఆదివారం కామారెడ్డి జిల్లా నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్నారు. సీఎంకు మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎంపీలు బలరాంనాయక్‌, ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ రామచంద్రనాయక్‌, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు, నాయని రాజేందర్‌రెడ్డి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, మురళీనాయక్‌ తదితరులు ఘన స్వాగతం పలికారు.
వనదేవతల సన్నిధిలో సీఎం:
మేడారం ప్రధాన ముఖద్వారం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి గిరిజన పూజారులు డోలు వాయిద్యాలు, గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకున్న సీఎం సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వనదేవతలను ప్రార్థించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తులాభారంలో 66 కిలోల నిలువెత్తు బెల్లాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజల అనంతరం గిరిజన పూజారులు సీఎంతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క సమ్మక్క–సారలమ్మ అమ్మవార్ల జ్ఞాపికలను ముఖ్యమంత్రికి, మంత్రులకు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి మొక్క నాటి పర్యావరణ పరిరక్షణపై సందేశం ఇచ్చారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ:
గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాలను ముఖ్యమంత్రి అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంక్షేమ పథకాలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అర్హులైన కుటుంబాలకు ప్రత్యక్షంగా చేరేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
భక్తుల కోసం శుద్ధ తాగునీటి కేంద్రం:
మేడారం వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శుద్ధ తాగునీటి కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ఆలయ పూజారులు, డోలు వాయిద్య కళాకారులు, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. మేడారం ప్రధాన కూడలిలో తనను కలిసేందుకు వచ్చిన ప్రజలు, అభిమానులను సీఎం ఆప్యాయంగా పలకరించారు. మేడారం అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా మేడారం ప్రాంతాన్ని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనులు చేపడుతోంది.
రూ.16,007 కోట్లతో రహదారుల అభివృద్ధి:
మేడారం కార్యక్రమాలు ముగించుకున్న ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్‌లో ములుగు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల హెలిప్యాడ్‌లో కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు, ఎస్పీ సుధీర్‌ రామ్నాథ్‌ కేకన్‌, జిల్లా అటవీ అధికారి వికాస్‌ మీనా, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రవిచందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేగ కళ్యాణి, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి గట్టమ్మ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన గ్రామీణ రహదారుల అభివృద్ధి పైలాన్‌ వద్దకు చేరుకున్న సీఎం దానిని ఆవిష్కరించి రాష్ట్ర గ్రామీణ రవాణా రంగంలో భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.16,007 కోట్ల అంచనా వ్యయంతో 2,145 గ్రామీణ రహదారులను 7,448 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. గ్రామ పంచాయతీలను మండల కేంద్రాలు, ప్రధాన రహదారులతో మెరుగ్గా అనుసంధానించడం, గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను బలోపేతం చేయడం ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. ఈ రహదారుల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాల నుంచి విద్య, వైద్యం, మార్కెట్లు, ఉపాధి కేంద్రాలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
రూ.868 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం:
ములుగు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి చేరుకున్న సీఎం జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సూచించే పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రూ.63.50 కోట్లతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు. జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన సుమారు రూ.868 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల వివరాలను పరిశీలించారు. నూతన కలెక్టరేట్‌ భవనం అందుబాటులోకి రావడంతో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవలు ఒకే సముదాయంలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో వివిధ శాఖల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గి ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, వేగంగా అందే అవకాశం ఏర్పడింది.
మేడారం వైభవాన్ని ప్రపంచానికి చాటుతాం:
కలెక్టరేట్‌ సభా వేదికగా ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ సమ్మక్క–సారలమ్మల ఆశీస్సులతోనే గతంలో పీసీసీ అధ్యక్షుడిగా తాను చేపట్టిన పాదయాత్రను ములుగు గడ్డ నుంచే ప్రారంభించానని గుర్తుచేశారు. రాష్ట్రంలోని నలుమూలలా గ్రామాలు, గూడేలు, పల్లెల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నామని, ప్రజలకు ఇచ్చిన భరోసా మేరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, సాగునీరు, రహదారులు, ఉపాధి అవకాశాలు, పర్యాటక రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. సమ్మక్క–సారలమ్మల సన్నిధి మేడారం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేలా అభివృద్ధి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. మేడారం దేవాలయ ప్రాంతాన్ని రామప్ప, వేయి స్తంభాల గుడి తరహాలో విశిష్టంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు మేడారం ఆధ్యాత్మిక, చారిత్రక, గిరిజన సాంస్కృతిక విశిష్టత ప్రపంచస్థాయిలో మరింత వెలుగొందేలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
మల్లూరు ఆలయానికి ప్రత్యేక నిధులు:
మల్లూరు నరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించడంతో పాటు మల్లూరు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ములుగు జిల్లాలోని ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాలను సమగ్ర పర్యాటక ప్రణాళికలో భాగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
జంపన్న వాగు సమగ్ర అభివృద్ధి:
మేడారం వచ్చే భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగును సమగ్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో చెక్‌డ్యామ్‌లు, స్నాన ఘట్టాలు నిర్మించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. మేడారం జాతర సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగు పరిసరాలను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మేడారం ఆలయం, గద్దెల ప్రాంగణం, జంపన్న వాగు పరిసరాల్లో భక్తులకు సౌకర్యాలు పెంచే పనులకు ప్రభుత్వం ఇప్పటికే ప్రాధాన్యం ఇచ్చింది.
సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి:
గోదావరి తీరంలో ఉన్న ములుగు జిల్లాలో సాగునీటి కొరత లేకుండా చేయడానికి అవసరమైన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర సమీక్ష నిర్వహించి అవసరమైన నిధుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు. ఆదివాసీ రైతులు సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకునేలా ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని తెలిపారు.
యువతకు సాంకేతిక నైపుణ్యాలు:
ములుగు జిల్లా యువతకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం తెలిపారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ఉన్నత విద్య అనంతరం నైపుణ్య విద్యపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. 12వ తరగతి తర్వాత అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు, పాలిటెక్నిక్‌ కళాశాలలు, స్కిల్‌ యూనివర్సిటీ వంటి సంస్థల ద్వారా సాంకేతిక, వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ములుగు ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం అందుబాటులోకి రావడం ఈ ప్రాంత విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమన్నారు. జర్మనీ, జపాన్‌, కొరియా వంటి దేశాల్లోని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేలా నిరుద్యోగ యువతకు జర్మన్‌, జపనీస్‌, కొరియన్‌ తదితర విదేశీ భాషలతో పాటు సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ అందించేందుకు చర్యలు చేపడతామని సీఎం తెలిపారు.
మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం:
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడేలా ‘సమ్మక్క–సారలమ్మ’ పేరుతో మహిళలకు నాణ్యమైన చీరలను అందించనున్నామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌లో చిలకపచ్చ రంగు చీరలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రి సీతక్క పర్యవేక్షణలో చీరల ఎంపిక, రూపకల్పన జరుగుతోందని తెలిపారు.
త్వరలో ఎస్పీ కార్యాలయం, కోర్టు భవనాలు:
నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ శాఖల సేవలు ఒకేచోట ప్రజలకు మరింత సులభంగా అందుతాయని సీఎం అన్నారు. త్వరలోనే జిల్లాలో ఎస్పీ కార్యాలయం, కోర్టు భవనాల నిర్మాణాలను కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
ములుగును ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతాం: సీతక్క
మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లా, ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్నారని తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతమైన ములుగును హైదరాబాద్‌ వంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నూతన కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సమ్మక్క–సారలమ్మ సన్నిధిని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం, ములుగు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పలుమార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారని సీతక్క తెలిపారు. ములుగు నియోజకవర్గానికి రాష్ట్రంలో అత్యధికంగా 5 వేల ఇందిరమ్మ ఇళ్లను కేటాయించడం ఈ ప్రాంతంపై ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. సాగునీటి రంగంలో పొట్లపల్లి ఎత్తిపోతల పథకం, రామప్ప–లక్నవరం అనుసంధాన పనులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. సమ్మక్క–సారలమ్మ సన్నిధి అభివృద్ధితో పాటు జిల్లాలో విద్య, వైద్యం, పర్యాటకం, గృహ నిర్మాణం, సాగునీరు, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా కట్టుబడి పనిచేస్తున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

భారీగా పాల్గొన్న ప్రజలు, అధికారులు:

ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్‌ రామ్నాథ్‌ కేకన్‌, జిల్లా అటవీ అధికారి వికాస్‌ మీనా, దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు, సెర్ప్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి దివ్య, మేడారం కార్యనిర్వహణ అధికారి వీరస్వామి, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గిరిజన పూజారులు, డోలు కళాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం–ములుగు పర్యటనలో ఆధ్యాత్మికత, గిరిజన సంక్షేమం, గ్రామీణ రహదారులు, జిల్లా పరిపాలనా మౌలిక వసతులు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సంక్షేమం, పర్యాటకం వంటి పలు రంగాలకు ప్రాధాన్యం లభించింది. ములుగు జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసి గిరిజన ప్రాంతాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు మేడారం ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యంగా సీఎం ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.