సింగరేణి అధికారుల సమస్యల పరిష్కారానికి భట్టి గ్రీన్ సిగ్నల్.
వేతన సవరణ, పీఆర్‌పీపై త్వరలో నిర్ణయం.
రెండు నుంచి మూడు నెలల్లో అధికార సంఘంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని యాజమాన్యానికి ఆదేశాలు.
సింగరేణిని అంతర్జాతీయ స్థాయి సంస్థగా తీర్చిదిద్దడంలో అధికారుల పాత్ర కీలకమని ఉప ముఖ్యమంత్రి స్పష్టం.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, జూలై 13:సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న సుమారు 2,200 మంది అధికారుల వేతన సవరణ, పర్‌ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ (పీఆర్‌పీ) అమలుతో పాటు ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అధికారుల సమస్యలపై ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు చేపట్టి, రానున్న రెండు నుంచి మూడు నెలల్లో అధికార సంఘంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని సోమవారం ఆదేశించారు. దీంతో గత కొంతకాలంగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళనలు కొనసాగిస్తున్న సింగరేణి అధికారుల్లో ఆశాభావం నెలకొంది. ఇటీవల ప్రజా ప్రభుత్వ చొరవతో సింగరేణికి అత్యంత కీలకమైన తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్‌కు మైనింగ్ లీజు లభించడంలో కీలక పాత్ర పోషించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను సింగరేణి అధికార సంఘం నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అదే సందర్భంగా అధికారుల వేతన సవరణ, పీఆర్‌పీ అమలు, ఇతర సేవా సంబంధిత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ విజ్ఞప్తులపై వెంటనే స్పందించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం ఉదయం సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి, డైరెక్టర్ (పర్సనల్ అండ్ ఫైనాన్స్) గౌతమ్ పోట్రుతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. కోల్ ఇండియా అనుబంధ సంస్థల్లో అమలులో ఉన్న విధానాలను పరిశీలించి, సింగరేణి అధికారుల వేతన సవరణ, పీఆర్‌పీ అంశాలపై ప్రాధాన్యంగా నిర్ణయం తీసుకోవాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. సింగరేణి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమని, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన ఇంధన భద్రత కల్పించడంలో కార్మికులు, అధికారులు సమష్టిగా విశేష కృషి చేస్తున్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో అధికారుల్లో అసంతృప్తి నెలకొనకుండా వారి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, అధికార సంఘం నాయకులతో చర్చించి వారికి పూర్తి భరోసా కల్పించాలని యాజమాన్యానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, బొగ్గు రంగంలో పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి, ఉత్పాదకత, విక్రయాల్లో సింగరేణి మరింత పోటీతత్వాన్ని సాధించాలని సూచించారు. బొగ్గు ఉత్పత్తితో పాటు విద్యుత్, సౌరశక్తి, బొగ్గు గ్యాసిఫికేషన్, కీలక ఖనిజాల అన్వేషణ వంటి బహుముఖ రంగాల్లో సంస్థ విస్తరణకు అధికారులు కీలక పాత్ర పోషించాలని, సింగరేణిని అంతర్జాతీయ స్థాయి సంస్థగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అధికార సంఘం నాయకులు కూడా అధికారుల్లో సానుకూల దృక్పథం, కార్యోన్ముఖత పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు.
ఉప ముఖ్యమంత్రికి అధికారుల సంఘం కృతజ్ఞతలు:
సింగరేణి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త బొగ్గు బ్లాక్‌ల సాధనకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్ది నరసింహులు కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యలను ఇటీవల ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి యాజమాన్యానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి అభివృద్ధి, విస్తరణ, సుస్థిర భవిష్యత్తు కోసం చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి అధికారుల తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని, సంస్థ అభివృద్ధి కోసం మరింత అంకితభావంతో పనిచేస్తామని వారు స్పష్టం చేశారు.