మహనీయుల చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
భూపాలపల్లిలో అంబేద్కర్, పూలే దంపతులు, గౌతమ బుద్ధుడి జీవిత చరిత్రల ప్రదర్శనలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 12: సమాజ మార్పు కోసం జీవితాలను అంకితం చేసిన మహనీయుల చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ముఖ్యంగా యువత, కార్మికులు, విద్యార్థుల్లో సామాజిక చైతన్యం పెంపొందించాలనే ఉద్దేశంతో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో మూడు రోజులపాటు మహనీయుల జీవిత చరిత్రల ఆధారంగా నాటక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు భూపాలపల్లి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్మికులు తమ కుటుంబ సభ్యులతో పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భూపాలపల్లి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో బుధవారం భూపాలపల్లి ఏరియాలోని వివిధ గనులు, విభాగాల పిట్ సెక్రటరీలు, బ్రాంచి నాయకులతో సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చక్రపాణి అధ్యక్షతన జరిగిన సమావేశానికి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.వి. రావు ముఖ్య అతిథిగా హాజరై మహనీయుల నాటకోత్సవాల ఏర్పాట్లు, కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు.
మూడు రోజులు.. ముగ్గురు మహనీయులు:
సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ కళాకారులచే మూడు రోజులపాటు మహనీయుల జీవిత చరిత్రల ఆధారంగా నాటకాలను ప్రదర్శించనున్నారు. ఆగస్టు 14న శరణం గచ్చామి అంబేద్కర్ – భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవిత చరిత్ర ఆధారంగా నాటకం. ఆగస్టు 15న సత్యశోధన – మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర ఆధారంగా నాటక ప్రదర్శన అలాగే ఆగస్టు 16న గౌతమ బుద్ధ – గౌతమ బుద్ధుడి జీవితం, బోధనలు, మానవతా సందేశాన్ని ప్రతిబింబించే నాటకం ఉంటుందని వారు వివరించారు. సామాజిక సమానత్వం, విద్య, మానవ హక్కులు, మహిళా విద్య, మూఢనమ్మకాల నిర్మూలన, శాంతి, మానవతా విలువలకు మహనీయులు చేసిన కృషిని నాటక రూపంలో ప్రజలకు చేరువ చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని సమావేశంలో వివరించారు.
యువ కార్మికుల్లో చైతన్యమే లక్ష్యం:
సింగరేణి సంస్థలో పదివేల మందికిపైగా యువ కార్మికులు ఉన్నారని, వారికి మహనీయుల జీవితాలు, ఆలోచనలు, సమాజ అభ్యున్నతికి వారు చేసిన కృషి గురించి తెలుసుకునే అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో సంస్థ వ్యాప్తంగా ఈ నాటక ప్రదర్శనలకు శ్రీకారం చుట్టినట్లు నాయకులు తెలిపారు. పుస్తకాలు చదవడం ద్వారా తెలుసుకునే చరిత్రను నాటక రూపంలో ప్రత్యక్షంగా వీక్షించడం ద్వారా యువతకు మరింత సులభంగా అర్థమవుతుందని పేర్కొన్నారు. సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా. బుద్ధప్రకాశ్ జ్యోతి, ఐఏఎస్, డైరెక్టర్ (పర్సనల్) గౌతమ్ పోట్రూ, ఐఏఎస్ చొరవతో సింగరేణి వ్యాప్తంగా మహనీయుల జీవిత చరిత్రలపై నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భూపాలపల్లి ఏరియాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రవీందర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు.
అన్ని వర్గాల భాగస్వామ్యంతో ఏర్పాట్లు:
నాటక ప్రదర్శనలకు కార్మికులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఉన్నతాధికారులు, గుర్తింపు పొందిన ప్రాతినిధ్య సంఘాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ లైజన్ అధికారులు, అసోసియేషన్ ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇలాంటి విలువైన కార్యక్రమాన్ని సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తున్న చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా. బుద్ధప్రకాశ్ జ్యోతి, డైరెక్టర్ (పా) గౌతమ్ పోట్రూ, భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రవీందర్ రెడ్డిలకు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. మహనీయుల జీవిత చరిత్రలు కేవలం గతాన్ని తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా, సమానత్వం, విద్య, సామాజిక న్యాయం, మానవతా విలువలను ఆచరణలో పెట్టేందుకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. అందువల్ల కార్మికులు తమ కుటుంబ సభ్యులు, పిల్లలు, విద్యార్థులతో కలిసి నాటక ప్రదర్శనలకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బ్రాంచి కార్యదర్శి మండల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ జనగాం రాజమల్లు, ఆర్గనైజర్ కోచర్ల రవి, ఎస్సీ, ఎస్టీ నాయకులు, కేటీకే-5 ఇంక్లైన్ హెడ్ ఓవర్‌మ్యాన్ నారాయణ, పిట్ సెక్రటరీలు గౌతమ్, కుమ్మరి శ్రీనివాస్, బద్రయ్య, మాతంగి రమేష్ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.