Take a fresh look at your lifestyle.

నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి.. 12వ వేతన ఒప్పంద చర్చలు వెంటనే ప్రారంభించాలి:జనక్ ప్రసాద్.

0 64

నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి.. 12వ వేతన ఒప్పంద చర్చలు వెంటనే ప్రారంభించాలి.

ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ డాక్టర్ బి. జనక్ ప్రసాద్.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)

భద్రాద్రి-కొత్తగూడెం, జూలై 1:కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని, సింగరేణి కార్మికుల 12వ వేతన ఒప్పందం (జేబీసీసీఐ–12) చర్చలను ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించాలని ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ డాక్టర్ బి. జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు. జాతీయ కార్మిక సంఘాల సంయుక్త వేదిక ఆధ్వర్యంలో బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో వేలాది మంది కార్మికులు, నాయకులు పాల్గొని తమ డిమాండ్లకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జనక్ ప్రసాద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులను బలహీనపరిచేలా ఉన్నాయని విమర్శించారు. దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులను నిర్వీర్యం చేసే ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల వేతన సవరణకు సంబంధించిన జేబీసీసీఐ–12 చర్చలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, కార్మికుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్చలు ప్రారంభించి న్యాయమైన వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని యాజమాన్యాన్ని కోరారు. కార్మికుల శ్రమతోనే సంస్థ లాభాల బాటలో పయనిస్తోందని, అలాంటి కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాలు కొనసాగుతాయని హెచ్చరించిన ఆయన, అవసరమైతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ధర్నా అనంతరం కార్మిక సంఘాల నాయకులు సింగరేణి జనరల్ మేనేజర్ (వెల్ఫేర్) కిరణ్ కుమార్‌కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి పశునూటి రాజేందర్, మహిళా అధ్యక్షురాలు మద్దినేని శేషరత్నం, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్లు జోగ బుచ్చయ్య, అందే రఘుపతిరెడ్డి, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బేటెల్లి మధుకర్ రెడ్డి, సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, సెక్రటరీలు రాజేష్ ఠాకూర్, నారెడ్ల సంపత్, బ్రాంచ్ సెక్రటరీలు బొడ్డు అశోక్, హుస్సేన్, కె. శంకర్, రవికిరణ్, లలితశ్రీ, పెద్దపల్లి స్వాతి తదితరులు పాల్గొన్నారు. అలాగే వివిధ ఏరియాల కార్మిక సంఘాల నాయకులు, మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరై ధర్నాను విజయవంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.