విద్యుత్ షాక్ తో చిరుత పులి మృతి
– పొలం వద్దే పాతి పెట్టిన రైతు
– రైతుచే వెలికి తీయించిన అటవీ అధికారులు
– ముగ్గురుని అదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు

ఎల్లారెడ్డి, ఆగష్టు 28 ( లోకంతీరు ) : పందుల బెడదా కోసం చెరుకు పంటను సంరక్షించేందుకు ఓ రైతు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు తగిలి చిరుత పులి మృత్యువాత పడిన సంఘటన ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తాండా గ్రామపంచాయతీ పరిదిలోని కట్టకింది తండా సమీపంలో చెరుకు తోట వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…తండాకు చెందిన గిరిజన రైతు కడావత్ దూప్య తన చెరుకు పంటను అడవి పందుల బెడద నుంచి కపాడు కోవడానికి విద్యుత్ తీగలు ఏర్పాటు చేశాడు. గత రెండు రోజుల క్రితం విద్యుత్ తీగలకు తగిలి చిరుత పులి మృత్యు వాతకు గురైంది. మంగళవారం గుర్తించిన రైతు భయపడి ఎక్కడ విషయం బయటకు పొక్కుతుందో అని గుట్టు చప్పుడు కాకుండా చెరుకు తోట వద్దే మృతి చెందిన చిరుత పులిని గోతి తవ్వి పాతి పెట్టాడు. ఇట్టి విషయం తండా వాసులచే అటవీ అధికారులకు తెలియడంతో, బుధవారం ఉదయం అటవీ శాఖ అధికారులు ఎఫ్ఆర్ఓ ఓంకార్ నాయక్, డీఆర్ఓలు శ్రీను నాయక్, పృథ్విరాజ్, విక్కీ మార్టిన్, వెటర్నరీ అసిస్టెంట్ సివిల్ సర్జన్ డాక్టర్ రవికుమార్, బేస్ క్యాంప్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. జిల్లా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎఫ్ డీ ఓ రామకృష్ణ ఘటన స్థలానికి చేరుకోగా రైతు దూప్యచే పూడ్చిన చిరుత పులిని బయటకు తీసి పరిశీలించారు. రెండు రోజుల క్రితం మృత్యువాతకు గురైనట్లు గుర్తించి చిరుత పులిని ఎల్లారెడ్డి అటవీ శాఖ కార్యాలయానికి తరలించి, చిరుత పులిని క్షుణ్ణంగా పరిశీలించి,పులి గొర్లు, చర్మం తీయలేదని గుర్తించి, కార్యాలయంలోనే పోస్టు మార్టం నిర్వహించారు. అనంతరం అటవీ ప్రాంతంలో పాతి పెట్టనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. చిరుత పులిని పాతి పెట్టిన రైతు కడావత్ దూప్య, గబ్బర్ సింగ్, గోవింద్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు ఎఫ్ డీఓ తెలిపారు.
విద్యుత్ తీగలు పెట్టి వన్య ప్రాణులను చంపొద్దు
రైతులు తమ పంటలను అడవి పందుల దాడుల నుంచి సంరక్షించు కునేందుకు, విద్యుత్ తీగలను ఏర్పాటు చేయవద్దని ఎఫ్ డీ ఓ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉందని, అటవీ ప్రాంతంలో చిరుత పులులు, ఎలుగు బంట్లు సంచరిస్తున్నాయని, వన్య ప్రాణులను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.