భూ రీ-సర్వేతో ప్రతి భూమికి డిజిటల్ మ్యాప్ తో కూడిన భూధార్ కార్డులు… జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్.
రైతుల సమక్షంలో పారదర్శకంగా హద్దుల నిర్ధారణ, అక్కడికక్కడే విస్తీర్ణం వివరాలు.
ఎర్రుపాలెం, మధిర మండలాలలో నిర్వహిస్తున్న భూ రీ సర్వే ను క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి )
ఖమ్మం, సెప్టెంబరు, 10 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే ద్వారా రైతుల భూములపై ఉన్న వివాదాలు, విస్తీర్ణ వ్యత్యాసాలు, రికార్డులలోని లోపాలను పూర్తి పారదర్శకంగా భూసమస్యలు పరిష్కారం కావాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ స్పష్టం చేశారు. మధిర నియోజకవర్గంలో గురువారం జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. మధిర మండలం తొండలగోపవరం గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో పంటపొలాలలో గట్ట వెంబటి నడుచుకుంటూ వెళ్లి రైతుల సమక్షంలో నిర్వహిస్తున్న రీ సర్వే ను క్షుణంగా పరిశీలించారు, అలాగే ఎర్రుపాలెం మండలం తాటిగూడెం రెవిన్యూ పరిధిలోని రాజుపాలెం, వెంకటపురం గ్రామాలలో జరుగుతున్న భూ రీసర్వే ప్రక్రియ పరిశీలించి రైతులతో కలెక్టర్ నేరుగా ముచ్చటించి సర్వే పై వారి అభిప్రాయాలను తెలుసుకొని రైతుల సందేహలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ.. మధిర నియోజకవర్గంలో పలు రెవెన్యూ పరిధిలోని గ్రామాలలో భూ సర్వే కొనసాగుతుందని కలెక్టర్ వివరించారు. ప్రతి మనిషికి అధార్ లాగా అధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం తో చేస్తున్న భూ సర్వే ద్వారా ప్రతి రైతు భూమికి డిజిటల్ మ్యాప్ తో కూడిన భూధార్ కార్డు ఉంటుందని తెలిపారు. గ్రామంలో గతంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు లేకపోవడం, అన్లైన్ ప్రక్రియలో పేర్లు నమోదు కాకపోవడం, రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి భూమిపై ఉన్న విస్తీర్ణానికి తేడాలు ఉండడం వంటి అనేక సమస్యలు ఎదుర్కుంటున్న వారికి, అలాగే ఉన్న భూ విస్తీర్ణము కొంతమందికి తక్కువగా నమోదు కాగా, మరికొందరికి ఎక్కువగా నమోదైన సందర్భాలు కూడా ఉన్నాయని, రీ-సర్వే ద్వారా అలాంటి అన్ని లోపాలను సరిచేస్తామని తెలిపారు. గ్రామంలోని ప్రతి రైతుకు ముందుగానే నోటీసులు జారీ చేసి, రైతుల సమక్షంలోనే వారి పొలాలను కొలుస్తామని కలెక్టర్ తెలిపారు. రైతులు స్వయంగా తమ భూమి హద్దులను చూపిస్తారని, ఇరువైపులా పక్కనే ఉన్న రైతులను కూడా పిలిచి పంచనామా నిర్వహించి హద్దులను నిర్ధారిస్తామని వివరించారు. భూ సర్వే కు నోటీసు ఇచ్చిన రైతులు వారి కుటుంబంలో భూ హక్కదారులు, పట్టా పాస్ బుక్ లో భూమి ఉన్న వారు అందరూ తప్పకుండా సర్వే వచ్చి పూర్తి వివరాలు తెలియజేసి సర్వే కు సహాకరించాలని కలెక్టర్ కోరారు. సర్వే పూర్తయ్యాక ఎంత విస్తీర్ణం నమోదైందో రైతులకు అక్కడికక్కడే తెలియజేస్తామని చెప్పారు. రైతులకు సందేహం ఉన్న మరొక్కసారి, రైతులు విశ్వసించే వరకు పారదర్శకంగా భూ రీ సర్వే చేసి వారితో స్వయంగా ఉన్న భూమి విస్తీర్ణముకు సంతకం కూడా తీసుకుంటామని పేర్కొన్నారు.
భూ రీ సర్వే మొత్తం ప్రక్రియ పూర్తిగా క్షేత్ర స్థాయిలో భూ హక్కుదారిని సమక్షంలో జరుగుతుందని, రైతుల హక్కులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులు అపోహలకు గురికాకుండా అధికారులు అందించే సమాచారాన్ని నమ్మకంతో భూ రీ-సర్వే కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని కోరారు.
రైతులు తమ పట్టాదారు పాస్బుక్, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర భూ రికార్డులు సర్వే అధికారులకు అందజేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో భూమి వాస్తవ హద్దులను చూపించి సహకరించాలని కలెక్టర్ కోరారు. సర్వే సమయంలో ఎదురయ్యే సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సర్వే అనంతరం గ్రామాల్లో భూ వివరాలను ప్రకటించి, వివరాలను గ్రామ పంచాయతీ, తహసీల్దారు కార్యాలయాలలో నోటీస్ బోర్డులో ఉంచుతామని, ఏలాండి అభ్యంతరాలకు గడువు ఇస్తామని, అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించిన తర్వాత వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి భూధార్ కార్డులు జారీ చేస్తామని పేర్కొన్నారు. రీ-సర్వే పూర్తయిన తర్వాత భవిష్యత్తులో భూ వివాదాలు గణనీయంగా తగ్గి రైతులకు శాశ్వత భద్రత కలుగుతుందని కలెక్టర్ దివాకర టీఎస్ స్పష్టం చేశారు.
ఈ కార్యాక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, మధిర తహసీల్దారు రాంబాబు, ఎర్రుపాలెం సునీత ఎలిజబెత్, గ్రామ సర్పంచ్ లు, సంబంధిత అధికారులు, సర్వేయర్లు, రైతులు తదితరులు ఉన్నారు.