నేటి నుంచి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు.
11 నుంచి 16 వరకు ఖమ్మం జిల్లాలో కార్యక్రమాలు. 17న హైదరాబాద్లో బహిరంగ సభ.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఖమ్మం, సెప్టెంబర్ 10: తెలంగాణ సాయుధ పోరాట 78వ వారోత్సవాలను ఈ నెల 11 నుంచి 16 వరకు ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తెలిపారు. వారోత్సవాల సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించనున్నట్లు గురువారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఈ నెల 11న ఉదయం నల్లమల గిరిప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో వారోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 12న చింతకాని మండలం ప్రొద్దుటూరు, బోనకల్ మండలం గోవిందాపురం గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 13న ఎం.వెంకటాయపాలెం, గోకినేపల్లి, నేలకొండపల్లి గ్రామాల్లో, 15న రఘునాథపాలెం మండలం పాపటపల్లి గ్రామంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని దండి సురేష్ తెలిపారు. 16న తనికెళ్ల, ఏన్కూరు మండలం మేడేపల్లి, సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామాల్లో సాయుధ పోరాట వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 17న సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు దండి సురేష్ తెలిపారు.