మానసిక ఒత్తిడిని అధిగమిస్తేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు
– సైకియాట్రిస్ట్ డా.రమణ

కామారెడ్డి జిల్లా/ తాడ్వాయి, సెప్టెంబర్ 04 ( లోకంతీరు ) : విద్యార్థులు క్షణికావేశాలకు లోను కాకూడదని, మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదని మొబైల్ ఫోన్లకు బానిస కాకూడదని, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రమణ సూచించారు. బుధవారం తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.మానసికంగా బాగుంటేనే శారీరకంగా ఆరోగ్యంగా వుండవచ్చని, ఎటువంటి వ్యాధినైన జయించవచ్చన్నారు. అలాగే విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని, తక్కువ మార్కులు వచ్చాయని సమాజంలో అవహేళనకు గురవుతున్నామని, క్షణికావేశాలకు లోనయ్యి ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. అంతేకాకుండా ఈ వయసులో మత్తుపదార్థాల జోలికి అస్సలు వెళ్లకూడదని, మొబైల్ ఫోన్ వినియోగం చేయకూడదని అవసరమైనంత మేరకు మాత్రమే కమ్యునికేషన్ లో భాగంగానే మొబైల్ వాడకం జరపాలని అన్నారు. కానీ వాటికి బానిస కావద్దని సూచించారు. చెడు ఆలోచనలను పక్కకు పెడుతూ చదువుపై దృష్టి పెట్టి లక్ష్యానికి చేరువ కావాలని అప్పుడే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. సోషల్ వర్కర్ డా.రాహుల్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మానసిక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు కౌన్సిలింగ్, మానసిక ఒత్తిడిని జయించే మార్గాలు, పరీక్షల సమయాల్లో విద్యార్థుల ప్రిపరేషన్ ప్రణాళికలపై కూలంకుషంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సయ్యద్ యూసఫ్ హుస్సేన్, ఎన్ఎస్ఎస్ ఇన్చార్జ్ శ్రీకాంత్, అధ్యాపకులు సంతోష్, వీరేశం, మల్లేశం, సతీష్చంద్ర, సరస్వతీ, శ్రీకాంత్, సతీష్, హరిక సిబ్బంది నర్సయ్య, సొటీరియా, లక్ష్మి పాల్గొన్నారు.