ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం జీవితాంతం పోరాడి అమరుడైన గిరిజన వీరుడు కొమురం భీం ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. ఆదివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన కొమురం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని విగ్రహంతో పాటు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ సమాజ హక్కుల పరిరక్షణ కోసం కొమురం భీం చేసిన త్యాగాలను ఎన్నటికీ మరువలేమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని, గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. యువత కొమురం భీం పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, టౌన్ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, స్థానిక కౌన్సిలర్లు, ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prev Post