Take a fresh look at your lifestyle.

సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయం ఆరోపణలపై విచారణ జరపాలి-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ.

0 33

                                                                                                                                        సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయం ఆరోపణలపై విచారణ జరపాలి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ.
₹1,600 కోట్ల విలువైన బొగ్గు అక్రమాలపై ఆందోళన వ్యక్తం.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, జూన్ 13: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)లో దాదాపు ₹1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటూ మీడియాలో వెలువడిన వార్తలపై అత్యవసర విచారణ చేపట్టాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జూన్ 10న రాసిన అధికారిక లేఖలో కిషన్ రెడ్డి, సింగరేణి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సంస్థగా, 40 వేల మందికి పైగా ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తోందని పేర్కొన్నారు. దేశీయ బొగ్గు ఉత్పత్తి, ఇంధన భద్రతలోనూ సింగరేణి కీలక పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు. ఇటీవల పలు మీడియా కథనాల్లో సింగరేణిలో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెలువడ్డాయని, ముఖ్యంగా సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందనే వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ బొగ్గు విలువ దాదాపు రూ.1,600 కోట్లుగా అంచనా వేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలు రూ.51,500 కోట్లకు మించి ఉన్న నేపథ్యంలో సంస్థ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని, ఈ తరహా ఆరోపణలు సంస్థ ప్రతిష్ఠతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని మరింత దెబ్బతీసే ప్రమాదం ఉందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై వాస్తవాలను తక్షణమే నిర్ధారించి సమగ్ర విచారణ జరిపించాలని, బొగ్గు నిల్వలు, ఉత్పత్తి, రవాణా, భద్రతా వ్యవస్థలపై సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రిని కోరారు. అలాగే సింగరేణిలో అమలవుతున్న అంతర్గత నియంత్రణ వ్యవస్థలు, భద్రతా ప్రమాణాలు, పర్యవేక్షణ విధానాల ప్రభావాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం, క్రమబద్ధమైన సమీక్షా విధానాలను అమలు చేయడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో సంస్థలో పారదర్శకత, విశ్వసనీయత, సామర్థ్యం మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. సింగరేణిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం దృష్ట్యా ఈ అంశంలో ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సింగరేణి భవిష్యత్తును, కార్మికుల ప్రయోజనాలను కాపాడటం ప్రభుత్వం మరియు సమాజం అందరి బాధ్యత అని ఆయన లేఖలో స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.