Take a fresh look at your lifestyle.

భూపాలపల్లిలో భారీ గాలిదుమారం బీభత్సం.

0 33

                                                                                                                                                                            భూపాలపల్లిలో భారీ గాలిదుమారం బీభత్సం.
విరిగిపడ్డ వృక్షాలు, కరెంట్ పోల్స్.. చీకట్లో అల్లాడిన ప్రజలు.
ఇద్దరికి గాయాలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదాలు.
అంధకారంలో జిల్లా కేంద్రం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, మే 28:
జయశంకర్-భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి ఒక్కసారిగా వీచిన భారీ గాలిదుమారం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. సుమారు 20 నిమిషాల పాటు ఉద్ధృతంగా వీచిన ఈదురుగాలులతో పట్టణమంతా అస్తవ్యస్తమైపోయింది. భారీ వృక్షాలు విరిగి రహదారులపై పడిపోగా, విద్యుత్ స్తంభాలు నేలకొరిగి జిల్లా కేంద్రంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సింగరేణి కృష్ణకాలనీలో రెండు విద్యుత్ పోల్స్ విరిగిపడగా, నాలుగు పోల్ మౌంటెడ్ ట్రాన్స్‌ఫార్మర్లు (పీఎంటీలు) ధ్వంసమయ్యాయి. కృష్ణకాలనీ ప్రధాన రహదారిపై భారీ ఎలక్ట్రికల్ పోల్ కూలిపడటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విరిగిన మరొక పోల్ సింగరేణి క్వార్టర్ పై పడటంతో భారీ నష్టం జరిగటంతో పాటు ఒక స్కూటీ పూర్తిగా ద్వంసమైంది. అలాగే సింగరేణి ఏరియా వర్క్‌షాప్ ముందు రోడ్డుమధ్యలో ఉన్న భారీ వృక్షం ఒక్కసారిగా విరిగి పడటంతో అక్కడుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. సుభాష్ కాలనీలో కూడా గాలిదుమారం తీవ్ర ప్రభావం చూపింది. భారీ వృక్షాలు విరిగి పడటంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే భూపాలపల్లిలో 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, విద్యుత్ అంతరాయం మరింత ఇబ్బందికర పరిస్థితులను తీసుకొచ్చింది. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. గాలిదుమారం సమయంలో ఎక్కడ చెట్లు విరిగి పడతాయో, ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయంతో ఇళ్లలోనే గడిపారు. ప్రకృతి ఒక్కసారిగా విరుచుకుపడటంతో పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఘటన అనంతరం సింగరేణి విద్యుత్ శాఖ, ప్రభుత్వ విద్యుత్ శాఖ, మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించి, విరిగిపడ్డ చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించే పనులు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.