సింగరేణిలో తక్షణమే ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించాలి.
అన్ని సంఘాలకు సమాన హోదా కల్పించాలి: బడితల సమ్మయ్య.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 12:సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో ట్రేడ్ యూనియన్ ఎన్నికల పదవీకాలం ముగిసినందున తక్షణమే తాజా ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) భూపాలపల్లి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బడితల సమ్మయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు టీబీజీకేఎస్ నాయకులు శనివారం భూపాలపల్లి ఏరియా పర్సనల్ మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బడితల సమ్మయ్య మాట్లాడుతూ, 2023 డిసెంబర్ 27న సీక్రెట్ బ్యాలెట్ ద్వారా సింగరేణిలో ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించారని తెలిపారు. ఎన్నికల తేదీని ప్రాతిపదికగా తీసుకున్నా, గుర్తింపు పొందిన యూనియన్ హోదా లేఖ అందిన తేదీ 2024 సెప్టెంబర్ 9ను ప్రాతిపదికగా తీసుకున్నా రెండేళ్ల పదవీకాలం ఈ నెల 8వ తేదీతో పూర్తయిందన్నారు. సింగరేణిలో ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా కార్మిక ప్రాతినిధ్య వ్యవస్థ కొనసాగాలంటే వీలైనంత త్వరగా తాజా ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించే వరకు సింగరేణిలోని అన్ని ట్రేడ్ యూనియన్లకు సమాన హోదా, సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని సంఘాలకు కార్మికుల సమస్యలపై ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్ నాయకులు బాసనపల్లి కుమారస్వామి, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బత్తిని సుదర్శన్, నాయకులు వెంకట్ రాజం, కేటీకే-1 ఇంక్లైన్ ఫిట్ సెక్రటరీ అన్నాడు మల్లారెడ్డి, 5 ఇంక్లైన్ ఫిట్ సెక్రటరీ దేవరకొండ మధు, కౌన్సిలర్ నరేందర్, 6 ఇంక్లైన్ ఫిట్ సెక్రటరీ కే. సురేష్, రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.