Take a fresh look at your lifestyle.

ఆదిలాబాద్ లో అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు.

0 2

అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు.

బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసిన వారినే టార్గెట్‌.
ప్రధాన నిందితుడు అరెస్ట్ – రూ.1.80 లక్షల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం.
తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో 22 కేసుల్లో ప్రమేయం.
పరారీలో మరో నలుగురు సభ్యుల కోసం ప్రత్యేక బృందాల గాలింపు.
కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఆదిలాబాద్, జూలై 25:బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసిన వారిని రహస్యంగా వెంబడించి, వారు వాహనాలను నిలిపి కొద్దిసేపు దూరంగా వెళ్లగానే స్కూటీల డిక్కీలు, కార్ల అద్దాలు పగులగొట్టి నగదును అపహరిస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా ప్రధాన నిందితుడు కర్ణాటకకు చెందిన శంకర్ అలియాస్ శంకరప్పను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.1,80,000 నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. గత నెల జూన్ 22న ఆదిలాబాద్ పట్టణంలోని ఐడీబీఐ బ్యాంక్ నుంచి రూ.3 లక్షలు డ్రా చేసిన వ్యక్తిని నిందితులు వెంబడించి, నేతాజీ చౌక్ సమీపంలోని మసీదు వద్ద పార్క్ చేసిన ఆక్టివా స్కూటీ డిక్కీని పగులగొట్టి నగదుతో పరారయ్యారని తెలిపారు. ఈ ఘటనపై నమోదు చేసిన కేసును శాస్త్రీయ ఆధారాలతో విచారించిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి కేసును ఛేదించారు. దర్యాప్తులో శంకర్ తన సహచరులు షేకర్, శ్రీనివాస్, సంజీవ్, సాయిలతో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని భద్రావతి నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లి బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసిన వారిని లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. ముందుగా బ్యాంకుల వద్ద రెక్కీ నిర్వహించి, నగదు తీసుకున్న వ్యక్తులను రహస్యంగా వెంబడించడం, వారు వాహనాల్లో నగదును ఉంచి వెళ్లిన సమయంలో స్కూటీ డిక్కీలు లేదా కార్ల అద్దాలు పగులగొట్టి నగదును అపహరించడం వీరి ప్రధాన నేరపద్ధతిగా గుర్తించినట్లు చెప్పారు. విచారణలో భాగంగా నిందితులు గత నెల భద్రావతి నుంచి నాగ్‌పూర్ మీదుగా మహారాష్ట్రలోని చంద్రపూర్ చేరుకుని అక్కడ ఒక మోటార్‌సైకిల్‌ను దొంగిలించినట్లు, అనంతరం చంద్రపూర్ పట్టణంలో ఓ కార్ అద్దాలు పగులగొట్టి బ్యాగ్‌లో ఉన్న రూ.25 వేల నగదును అపహరించినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. అనంతరం ఆదిలాబాద్ చేరుకుని ఐడీబీఐ బ్యాంక్ వద్ద నగదు డ్రా చేసిన వ్యక్తిని వెంబడించి రూ.3 లక్షలు అపహరించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. అపహరించిన నగదులో తన వాటాగా వచ్చిన మొత్తంలో మిగిలిన రూ.1.80 లక్షలను పోలీసులు రికవరీ చేసినట్లు చెప్పారు. నిందితులు తెలంగాణలో హైదరాబాద్‌లోని చార్మినార్, లుంబినీ పార్క్, జేబీఎస్, రైల్వే స్టేషన్, వరంగల్, నిజామాబాద్, బైంసా, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, మహారాష్ట్రలో చంద్రపూర్, ఔరంగాబాద్, నాసిక్, పండరకవాడ, కర్ణాటకలో బెంగళూరు, బళ్లారి, రాయచూర్ తదితర ప్రాంతాల్లో ఇదే తరహాలో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారని ఎస్పీ వెల్లడించారు. ముఠాపై ఇప్పటివరకు మొత్తం 22 కేసులు నమోదైనట్లు తెలిపారు. అరెస్టయిన నిందితుడు శంకర్ అలియాస్ శంకరప్ప (43), తండ్రి లక్ష్మణ్, శివమొగ్గ జిల్లా భద్రావతి పట్టణానికి చెందిన హమాలీగా పనిచేస్తున్నాడు. ఈ కేసులో పరారీలో ఉన్న షేకర్, శ్రీనివాస్, సంజీవ్, సాయిల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని, ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎస్పీ అఖిల్ మహాజన్ కీలక సూచనలు చేశారు. బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసిన తర్వాత వాహనాల డిక్కీల్లో లేదా కార్లలో నగదును ఉంచి నిర్లక్ష్యంగా వెళ్లవద్దని, ఎవరైనా అనుమానాస్పదంగా వెంబడిస్తున్నట్లు అనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్-100కు సమాచారం అందించాలని సూచించారు. కేసును ఛేదించి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి, నగదు రికవరీ చేసిన దర్యాప్తు అధికారులను, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, వన్‌టౌన్ సీఐ బి. సునీల్ కుమార్, ఎస్సైలు నాగనాథ్, సంజయ్, సైబర్ క్రైమ్ ఎస్సై గోపీకృష్ణతో పాటు రమేష్, త్రిశూల్, హనుమంతు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.