తాడిచెర్ల బొగ్గు బ్లాక్-2, మణుగూరు పీకే ఓసీ-2 ప్రాజెక్టులను సింగరేణికే కేటాయించాలి : కిషన్ రెడ్డికి ఎబికెఎంఎస్-బిఎంఎస్ వినతి.

తాడిచెర్ల బొగ్గు బ్లాక్-2, మణుగూరు పీకే ఓసీ-2 ప్రాజెక్టులను సింగరేణికే కేటాయించాలి.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి ఎబికెఎంఎస్-బిఎంఎస్ వినతి.
ఇల్లందు పూసపల్లి ఓసీ ప్రారంభం, 12వ వేతన కమిటీ ఏర్పాటు, రూ.56 వేల కోట్ల బకాయిల చెల్లింపుపైనా విజ్ఞప్తి.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, జూన్ 30: తాడిచెర్ల బొగ్గు బ్లాక్–2, మణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు కేటాయించాలని, ఇల్లందు పూసపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టును తక్షణమే ప్రారంభించాలని, 12వ వేతన కమిటీ (జేబీసీసీఐ-12)ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (ఎబికెఎంఎస్-బిఎంఎస్ ) నాయకులు హైదరాబాద్ లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి మంగళవారం వినతిపత్రం సమర్పించారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాక్ గార్డెన్ కన్వెన్షన్ హాల్‌లో కేంద్ర మంత్రిని కలిసిన ప్రతినిధి బృందంలో ఎబికెఎంఎస్ కార్యదర్శి, నేషనల్ డస్ట్ ప్రివెన్షన్ కమిటీ సభ్యుడు పి. మాధవ నాయక్, సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ (ఎస్.సి.ఎం.కె.ఎస్.) అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి కుమారస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సింగరేణిలోని పలు గనుల్లో బొగ్గు నిల్వలు క్రమంగా తగ్గిపోతుండటంతో భవిష్యత్తులో కొన్ని గనులు మూతపడే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని, దీనివల్ల వేలాది మంది కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తాడిచెర్ల బొగ్గు బ్లాక్-2లో సుమారు 277 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గు నిల్వలు, మణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులో సుమారు 215 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని వివరించారు. బొగ్గు తవ్వకాలలో సింగరేణికి ఉన్న అపార అనుభవం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సమర్థవంతమైన యంత్రాంగం, మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు ప్రాజెక్టులను సింగరేణికే కేటాయించడం సంస్థ భవిష్యత్తుకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. అదేవిధంగా ఇల్లందు ప్రాంతంలోని పూసపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టును వెంటనే ప్రారంభించేలా సింగరేణి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. 12వ వేతన కమిటీ (జేబీసీసీఐ-12) ఏర్పాటుకు కోల్ ఇండియా యాజమాన్యంతో చర్చించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం, ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల నుంచి రావాల్సిన సుమారు రూ.56 వేల కోట్ల బకాయిలను తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రారంభించాలని కూడా కోరినట్లు తెలిపారు. అలాగే సింగరేణిలో రాజకీయ జోక్యం పెరగడం వల్ల సంస్థ ప్రయోజనాలకు భంగం కలిగే ప్రమాదం ఉందని, సంస్థ స్వతంత్రతను, కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. వినతిపత్రంపై స్పందించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తాడిచెర్ల బొగ్గు బ్లాక్–II, మణుగూరు పీకే ఓసీ-II డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులను సింగరేణికి కేటాయించే అంశంపై సానుకూలంగా పరిశీలించి త్వరలోనే అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. అలాగే 12వ వేతన కమిటీ ఏర్పాటు విషయమై కోల్ ఇండియా అధికారులతో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటానని మంత్రి భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్యుల సానుకూల స్పందన సింగరేణి కార్మికుల్లో కొత్త ఆశలను నింపిందని ఎబికెఎంఎస్-బిఎంఎస్ నాయకులు తెలిపారు. తాడిచెర్ల బ్లాక్–2, మణుగూరు పీకే ఓసీ-2 ప్రాజెక్టులు సింగరేణికి కేటాయిస్తే సంస్థ భవిష్యత్తు మరింత బలోపేతం కావడంతో పాటు వేలాది మంది కార్మికుల ఉపాధి భద్రతకు శాశ్వత భరోసా లభిస్తుందని, తెలంగాణ పారిశ్రామికాభివృద్ధి, దేశ ఇంధన భద్రతకు కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. దేశీయ బొగ్గు ఉత్పత్తి పెరిగి దిగుమతులపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (ఎబికెఎంఎస్-బిఎంఎస్) ఎల్లప్పుడూ “కార్మికుల సంక్షేమం–పరిశ్రమ ప్రగతి–దేశాభివృద్ధి” అనే సిద్ధాంతంతో పనిచేస్తూ, సింగరేణి అభివృద్ధి, కార్మికుల హక్కుల పరిరక్షణ, దేశ ఇంధన స్వావలంబన కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ ఉద్యమానికి సింగరేణి కార్మికులందరూ సంఘీభావం ప్రకటించి సంఘానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండా రమాకాంత్, పులి రాజిరెడ్డి, యాదగిరి సత్తయ్య, వై. సారంగపాణి, జీవీ కృష్ణారెడ్డి, ఎ. వెంకటేశ్వర్లు, మొగిలిపాక రవికుమార్, బి. కిషన్, అల్లి ప్రకాశ్‌రావు, సాయివేణి సతీష్, హరీన్ పటేల్, నాయిని సైదులు, లీలా కృష్ణ, దశరథం, పి. శ్రీనివాస్, సత్కూరి శ్రీనివాస్, పండ్రాల మల్లేష్, ఆర్. నర్సింగరావు, రూపేశ్వరచారి, కర్రవుల మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.