
సింగరేణికి అధికారుల గోడు వినిపించడం లేదా?
స్పందించని యాజమాన్యంపై అధికారుల ఆవేదన.
హెడ్‌ఆఫీస్ ఎదుట మరోసారి నిరసన.
ఈ నెల 29 నుంచి రిలే నిరాహార దీక్షలకు అధికారుల సంఘం నిర్ణయం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 24:తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సింగరేణి వ్యాప్తంగా చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలకు యాజమాన్యం నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో సింగరేణి అధికారులు మరోసారి నిరసన బాట పట్టారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో అధికారులు నిరసన కార్యక్రమంలో పాల్గొని తమ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం వరకు ప్రతి రోజు సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు కొనసాగించాలని అధికారుల సంఘం నిర్ణయించింది. అదేవిధంగా ఈ నెల 29వ తేదీ నుంచి హెడ్‌ఆఫీస్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు సంఘం ప్రకటించింది. విధులు ముగిసిన అనంతరం ప్రధాన కార్యాలయం గేటు వద్దకు చేరుకున్న అధికారులు, యాజమాన్యం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అఖిల భారత బొగ్గు గనుల అధికారుల సంఘం (సీఎంఓఏఐ) సింగరేణి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
రెండేళ్లుగా పెండింగ్‌లో కీలక సమస్యలు:
సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మిపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్ది నర్సింహులు మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా అధికారులకు సంబంధించిన పలు కీలక సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్‌పీ) బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదని పేర్కొన్నారు. అలాగే 2017 వేతన సవరణ (పీఆర్‌సీ)లో జరిగిన అన్యాయాన్ని సవరించేందుకు న్యాయస్థానం తీర్పు వెలువడిన నేపథ్యంలో, కోల్ ఇండియాలో అమలు చేస్తున్న పే అప్‌గ్రేడేషన్ విధానాన్ని సింగరేణిలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
హామీలు తప్ప అమలు లేదంటున్న అధికారులు:
సంస్థ అభివృద్ధి, ఉత్పాదకత, లాభదాయకతలో అధికారుల పాత్ర కీలకమని పేర్కొన్న సంఘం నాయకులు, తమకు రావలసిన న్యాయమైన ప్రయోజనాలను ఆలస్యం చేయడం సమంజసం కాదన్నారు. సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు యాజమాన్యానికి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, చర్చలు జరిపినప్పటికీ, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదని తెలిపారు. యాజమాన్యం ఇచ్చిన హామీలను గౌరవిస్తూ కొన్ని ఆందోళన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు స్పష్టమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అధికారుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కార్యక్రమాలు మరింత ఉద్ధృతం చేస్తామని, రిలే నిరాహార దీక్షలతో పాటు తదుపరి కార్యాచరణను కూడా ప్రకటిస్తామని సంఘం నాయకులు హెచ్చరించారు.