Take a fresh look at your lifestyle.

విలేకరులను దూషించిన మార్కెట్ కమిటీ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలి :రేగొండ ప్రెస్ క్లబ్

0 5

విలేకరులను దూషించిన మార్కెట్ కమిటీ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలి.

కిష్టయ్యను పదవి నుంచి తొలగించాలి.. కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ చేయాలి.

చర్యలు తీసుకునే వరకు కాంగ్రెస్‌ కార్యక్రమాల బహిష్కరణకు రేగొండ విలేకరుల సంఘం తీర్మానం.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)

రేగొండ, ఆగస్టు 9:పత్రికా విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేసి, దుర్భాషలాడిన భూపాలపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గూటోజు కిష్టయ్యపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని రేగొండ విలేకరుల సంఘం డిమాండ్‌ చేసింది. ఆయనను మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి నుంచి తొలగించడంతో పాటు కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. రేగొండ మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు పట్టెం కోటి మాట్లాడుతూ ఘటన వివరాలను వెల్లడించారు. రేగొండ ఉమ్మడి మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు భూపాలపల్లి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా రేపాక గ్రామంలో వార్తా సేకరణకు వెళ్లిన విలేకరుల పట్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కిష్టయ్య అనుచితంగా వ్యవహరించారని తెలిపారు. విలేకరులను ఉద్దేశించి ‘‘ఏం రాసుకుంటారో రాసుకోండి’’ అంటూ దురుసుగా మాట్లాడి, తీవ్రంగా అవమానించారని ఆరోపించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ నిరంతరం విధులు నిర్వహిస్తున్న పాత్రికేయుల పట్ల బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా వ్యవహరించడం గర్హనీయమని అన్నారు.

కాంగ్రెస్‌ కార్యక్రమాల బహిష్కరణ:

విలేకరులను అవమానించిన మార్కెట్‌ కమిటీ చైర్మన్‌పై భూపాలపల్లి ఎమ్మెల్యే వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్‌ చేసింది. చర్యలు తీసుకునే వరకు రేగొండ మండలంలో నిర్వహించే కాంగ్రెస్‌ పార్టీ అధికారిక, రాజకీయ కార్యక్రమాలను విలేకరులు బహిష్కరించాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు పట్టెం కోటి తెలిపారు. ఇది వ్యక్తిగతంగా ఎవరినీ లక్ష్యంగా చేసుకోవడం కాదని, పాత్రికేయుల గౌరవం, స్వేచ్ఛను కాపాడేందుకు తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రెస్‌క్లబ్‌ మాజీ అధ్యక్షుడు బండి సోమయ్య, ఉపాధ్యక్షుడు బండి కమలాకర్‌, గౌరవ అధ్యక్షులు నామాల రమేష్‌, అంబాల రవీందర్‌, కోశాధికారి రహీమ్‌తో పాటు పలువురు మండల విలేకరులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.