
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి.
మెడికల్ బోర్డు ఏరియా ఆసుపత్రుల్లోనే నిర్వహించాలి.
రిటైర్డ్ కార్మికుల వైద్య పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలి.
కార్మికులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలి.
ఐఎన్టీయూసీ ‘బాయి బాట’లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 22: సింగరేణి కార్మికుల సంక్షేమం, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ సంస్థ యాజమాన్యం చర్యలు చేపట్టాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కోరారు. జాతీయ భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా చట్టబద్ధమైన రక్షణ చర్యలను అమలు చేస్తూనే ఉత్పత్తి సాధించాలని సూచించారు. కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. భూపాలపల్లి ఏరియాలో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఐఎన్టీయూసీ అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన బాయి బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం కేటీకే ఓసీత్రీ ప్రాజెక్టులో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్‌తో కలిసి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సింగరేణిలో భద్రతతో కూడిన ఉత్పత్తికి యాజమాన్యం ప్రాధాన్యం ఇవ్వాలని, కార్మికుల సూచనలు, సలహాలను స్వీకరించి జాతీయ భద్రతా మార్గదర్శకాల ప్రకారం రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కార్మికులు, వారి కుటుంబాల ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదన్నారు. సింగరేణి మెడికల్ బోర్డు పరీక్షలను కొత్తగూడెంలో కాకుండా సంబంధిత ఏరియా ఆసుపత్రుల్లోనే నిర్వహించాలని, అన్‌ఫిట్ విధానాన్ని ప్రతి నెలా క్రమం తప్పకుండా అమలు చేయాలని కోరారు. భూపాలపల్లి ఏరియా ఆసుపత్రుల్లో గుండె, నరాలు, కంటి, కిడ్నీ, పిల్లలు, ఆర్థోపెడిక్, ఊపిరితిత్తుల విభాగాలకు అవసరమైన స్పెషలిస్ట్ వైద్యులను నియమించాలని, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలకు అవసరమైన రేడియాలజిస్టులను కూడా వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. కంపెనీ అధికారులకు అమలు చేస్తున్న అలవెన్సులు, ఆదాయపు పన్ను విధానంలో కార్మికులకు కూడా సమాన ప్రయోజనం కల్పించాలని అన్నారు. రిటైర్డ్ అధికారులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందిస్తున్న రూ.25 లక్షల వరకు వైద్య ఆర్థిక సహాయాన్ని రిటైర్డ్ కార్మికులకు కూడా వర్తింపజేయాలని, ప్రస్తుతం ఉన్న రూ.8 లక్షల పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని కోరారు. సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చేందుకు కనీసం 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. కార్మికుల సర్వీస్ రికార్డుల్లో నమోదైన మారుపేర్ల సమస్యలు, వాటికి సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్లను తెలంగాణలో అమలు చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం కోసం కూడా చర్యలు చేపట్టామని, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ ఇప్పించామని ఎమ్మెల్యే తెలిపారు. కార్మికుల సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఏరియా ఇంటక్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బేతెల్లి మధుకర్ రెడ్డి సారథ్యం వహించగా, కేటీకే ఓసీత్రీ ఐఎన్టీయూసీ పిట్ సెక్రటరీలు సంగం శ్రీనివాస్, గాజర్ల హరికృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు, జనరల్ సెక్రటరీ పసునూటి రాజేందర్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ జోగ బుచ్చయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు రత్నం సమ్మిరెడ్డి, వేణుగోపాల్ యాదవ్, సెంట్రల్ సెక్రటరీ చెల్పూరి సదయ్య, భూపాలపల్లి ఏరియా స్ట్రక్చర్ కమిటీ నాయకులు బొడ్డు అశోక్, షేక్ హుస్సేన్, బ్రాంచ్ నాయకులు కుడుదుల శంకర్, రవికిరణ్, కేటీకే-ఓసీ-3 ప్రాజెక్టు వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్ ఎన్.సురేష్ పాల్గొన్నారు. అలాగే కేటీకే ఓసీత్రీ ప్రాజెక్టు వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్ (మెకానికల్) ఏ.క్రాంతికుమార్, టెంపుల్ కమిటీ చైర్మన్ ఈగ శ్రీనివాస్, కేటీకే-8 ఇంక్లైన్ అసిస్టెంట్ పిట్ సెక్రటరీలు భేరి రాజయ్య, వినోద్ కుమార్, మాతంగి రమేష్, కేటీకే ఓసీత్రీ ప్రాజెక్టు అసిస్టెంట్ పిట్ సెక్రటరీ సల్లూరి రాము తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు అప్పం రాములు, రాచకొండ శంకర్, ప్రదీప్ రెడ్డి, జితేందర్, గాజుల్లా మల్లయ్య, నక్క విజయ్, పయ్యాల శ్రీనివాస్, శ్రీధర్, వాసు, ఓదెలు, బుర్ర శ్రీను, సాగర్, సతీష్, కృష్ణ, దీపక్, బద్రు, బుర్ర తిరుపతి, రవీందర్, ఆర్.మల్లయ్య, నవీన్, శ్రీవాస్తవ, హ్యూమన్, సుంకరి శ్రీనివాస్, జి.శంకర్, హబీబ్, చి.శ్రీనివాస్, కుమారస్వామి, రామకృష్ణతో పాటు మహిళా కార్మికులు సుస్మిత, మౌనిక, రూపిక, స్రవంతి, పలువురు సింగరేణి కార్మికులు పాల్గొన్నారు.