Take a fresh look at your lifestyle.

అంతరిక్ష రంగంలో భాసించిన ఆర్జీయూకేటీ బాసర పూర్వ విద్యార్థిని ‘అనూహ్య’.

0 3

అంతరిక్ష రంగంలో భాసించిన ఆర్జీయూకేటీ బాసర పూర్వ విద్యార్థిని ‘అనూహ్య’.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి) 

నిర్మల్,ఆగస్టు 7: నిర్మల్ జిల్లాలోని బాసర లోని ప్రసిద్ధి బాసర త్రిబుల్ ఐటీ లోని విద్యార్థిని భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ “విక్రమ్-1” (మిషన్ ఆగమనం) విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన చారిత్రాత్మక ఘట్టంలో “రాజీవ్ గాంధీ యానివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ – ట్రిపులైటీ బాసర” పూర్వ విద్యార్థిని “అలుగోజు అనూహ్య” విశేష ప్రతిభ కనబరిచి విశ్వవిద్యాలయంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి విశేష ఖ్యాతిని తీసుకువచ్చారు. ప్రముఖ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ (Skyroot Aerospace) సంస్థలో సాంకేతిక విభాగానికి చెందిన ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనూహ్య, ఈ ప్రతిష్టాత్మక మిషన్ ప్రయోగానికి అవసరమైన కీలకమైన సాంకేతిక అనుసంధాన వ్యవస్థల నిర్వహణలో ప్రధాన భూమిక పోషించారు.

కష్టాలను జయించి అంతరిక్ష శిఖరాలకు..

కరీంనగర్లో ప్రాథమిక విద్యనభ్యసించి, 2018–2024 మధ్య కాలంలో ఆర్జీయూకేటీ బాసరాలో బీటెక్ పూర్తి చేసిన అనూహ్య ప్రయాణం ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకం. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అనూహ్య తల్లి, “శ్రీమతి అలుగోజు లతాశ్రీ”, ఒంటరి మహిళగా వ్యవసాయ పనులు చేస్తూ, ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ తన పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. తల్లి పడిన త్యాగాలు, అందించిన ప్రోత్సాహమే నేడు అనూహ్యను దేశం గర్వించే స్థాయికి చేర్చాయి. ఇదే విశ్వవిద్యాలయానికి చెందిన ఆమె సోదరుడు ‘అలుగోజు ఆదిత్య (B171255)’ కూడా STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) విద్య, రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు (AI) రంగాల్లో శిక్షణనిస్తూ భవిష్యత్ తరాల విద్యార్థులను శాస్త్రవేత్తలుగా, ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దే బృహత్తర కార్యంలో భాగస్వాములవుతున్నారు. ఒకే ఇంట్లో తల్లి కష్టానికి ప్రతిరూపాలుగా ఇద్దరు పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించడం విశేషం.

విశ్వవిద్యాలయ యంత్రాంగం అభినందనలు:

ఈ సందర్భంగా ఆర్జీయూకేటీ బాసర వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ అనూహ్య సాధించిన విజయాన్ని ప్రత్యేకంగా అభినందించారు. “గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఉన్నతికి పెద్దపీట వేస్తూ, వారిని అంతర్జాతీయ స్థాయి ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దడమే మా విశ్వవిద్యాలయ ప్రధాన లక్ష్యం. అనూహ్య సాధించిన ఈ అసాధారణ విజయం నేడు వేలాది మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుంది. తమ హయాంలో సాంకేతిక విద్యను నూతన శిఖరాలకు తీసుకెళ్తూ, భవిష్యత్ దేశ నిర్మాతలైన విద్యార్థులను తయారు చేయడానికి ఆర్జీయూకేటీ బాసర అహర్నిశలు శ్రమిస్తోందన్నారు. అలాగే విశ్వవిద్యాలయ ఓ.ఎస్.డి. ప్రొఫెసర్ ఇ. మురళీదర్శన్, అసోసియేట్ డీన్లు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, ఇతర అధికారులు, సిబ్బంది మరియు విద్యార్థులు అనూహ్య అలుగోజుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.