Take a fresh look at your lifestyle.

సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ కేసుల డిపెండెంట్లకు ఉద్యోగాలెప్పుడు?

0 1

సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ కేసుల డిపెండెంట్లకు ఉద్యోగాలెప్పుడు?
ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లోనే సమస్య.. కమిటీల పేరుతో కాలయాపనపై ఆగ్రహం.
సింగరేణి హెడ్‌ఆఫీస్ ఎదుట నిరవధిక దీక్షలు.. ఐఎఫ్టీయూ, ఏఐటీయూసీ మద్దతు

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, ఆగస్టు 12:

సింగరేణి కాలరీస్‌లో మారుపేర్లు, విజిలెన్స్ కేసులకు సంబంధించిన కార్మికుల డిపెండెంట్ల ఉద్యోగాల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని ఈ సమస్యపై బాధిత కుటుంబాలు ఇక తాడోపేడో తేల్చుకునేందుకు ఉద్యమబాట పట్టాయి. ఉద్యోగాలు కల్పించే వరకు పోరాటాన్ని విరమించబోమని స్పష్టం చేస్తూ బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి హెడ్‌ఆఫీస్ ఎదుట నిరవధిక నిరసన దీక్షలు ప్రారంభించారు. బాధితుల ఆందోళనకు ఐఎఫ్టీయూ, జీఎల్బీకేఎస్, ఏఐటీయూసీ నాయకులు సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు.

ఎనిమిదేళ్లుగా ఎదురుచూపులే..

మారుపేర్లు, విజిలెన్స్ కేసులకు సంబంధించిన డిపెండెంట్ల ఉద్యోగాల సమస్య సుమారు ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉందని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ అంశం అసెంబ్లీలో చర్చకు వచ్చిందని, వన్‌టైం సెటిల్‌మెంట్ ద్వారా డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించే దిశగా నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రభుత్వం మారడంతో సమస్య మళ్లీ పెండింగ్‌లో పడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కోల్‌బెల్ట్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీతో కార్మికులు, ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారని వంగ వెంకట్ గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు.

కమిటీలతో కాలయాపన వద్దు:

పదకొండు ఏరియాల కోల్‌బెల్ట్ ప్రాంతాలకు చెందిన బాధిత కుటుంబాలు ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నాయని ఐఎఫ్టీయూ, జీఎల్బీకేఎస్ నాయకులు తెలిపారు. ఉద్యోగాలు కల్పించకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడం బాధిత కుటుంబాలకు అన్యాయం చేయడమేనని విమర్శించారు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదనను ఎదుర్కొంటున్న కుటుంబాలు న్యాయం కోసం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట దీక్షకు దిగాల్సిన పరిస్థితి రావడం ఆందోళనకరమన్నారు. ఇకనైనా కమిటీల పేరుతో జాప్యం చేయకుండా నేరుగా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టి బాధితులకు నియామక పత్రాలు అందించాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

ఏజీ ఆదేశాల కోసం ఎదురుచూపులు:

డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించే అంశంపై అడ్వకేట్ జనరల్‌కు లేఖ రాసినట్లు సింగరేణి యాజమాన్యం చెబుతోందని వంగ వెంకట్ తెలిపారు. ఏజీ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఉద్యోగాలు కల్పిస్తామని యాజమాన్యం యూనియన్‌తో జరిగిన సమావేశంలో చెప్పిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని న్యాయశాఖ మంత్రి లేదా అడ్వకేట్ జనరల్ నుంచి అవసరమైన ఆదేశాలు వచ్చేలా చర్యలు చేపడితే సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ యాజమాన్యంతో నిర్వహించిన తొలి స్ట్రక్చర్ సమావేశంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించామని, సమ్మె నోటీసులోనూ డిపెండెంట్ల ఉద్యోగాల డిమాండ్‌ను ప్రధాన అంశంగా చేర్చామని ఆయన తెలిపారు.

ఎమ్మెల్యేలు ఒత్తిడి తేవాలి:

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఉద్యోగాల కల్పనలో జాప్యం జరుగుతోందని ఆరోపించిన వంగ వెంకట్.. కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఈ సమస్యపై ప్రభుత్వంపై తగిన స్థాయిలో ఒత్తిడి తీసుకురావడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు ఏకతాటిపైకి వచ్చి ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు, అధికారులతో చర్చించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగాలు వచ్చే వరకు దీక్ష:

తమకు ఉద్యోగాలు లభించే వరకు నిరవధిక నిరసన దీక్షలు కొనసాగుతాయని సింగరేణి మారుపేర్ల బాధితుల సంఘం అధ్యక్షుడు లక్కా శ్రావణ్ గౌడ్ స్పష్టం చేశారు. బాధితుల న్యాయమైన పోరాటానికి ఐఎఫ్టీయూ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు తెలిపారు. దీక్షా శిబిరాన్ని ఐఎఫ్టీయూ నాయకులు జి. సంజీవరావు, నాగేశ్వరరావు, మోత్కురి మల్లికార్జున, బి. వెంకటమ్మ, ఎల్. నరేష్, కే. నాగమణి తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్‌తో పాటు కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, బ్రాంచ్ కార్యదర్శులు రమణమూర్తి, గట్టయ్య, ఉపాధ్యక్షులు క్రిస్టోఫర్, సహాయ కార్యదర్శి రాము, ఆఫీస్ బేరర్లు సందబోయిన శ్రీనివాస్, భరణి, పిట్ కార్యదర్శులు మధు కృష్ణ, కమల్, నరేష్, బండారి మల్లయ్య, మండల రాజేశ్వరరావు, నాగయ్య, గావిని నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏఐటీయూసీ నాయకులు నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు. అయితే ఉద్యోగాల నియామకంపై స్పష్టమైన నిర్ణయం వెలువడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బాధితులు తేల్చిచెప్పారు.

Leave A Reply

Your email address will not be published.