Take a fresh look at your lifestyle.

సింగరేణి కార్మికులకు ఇళ్ల యాజమాన్య హక్కులు కల్పించాలి – కల్వకుంట్ల కవిత.

0 11

సింగరేణి కార్మికులకు ఇళ్ల యాజమాన్య హక్కులు కల్పించాలి.

మెడికల్ బోర్డుల ఏర్పాటుకు నెల రోజుల గడువు: కల్వకుంట్ల కవిత.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)

జయశంకర్-భూపాలపల్లి, జూన్ 20:సింగరేణి కార్మికుల సంక్షేమం, ఆరోగ్య భద్రత విషయంలో ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా సింగరేణికి సేవలందించిన కార్మికులకు ఇళ్ల యాజమాన్య హక్కులు కల్పించడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న మెడికల్ బోర్డులను వెంటనే నిర్వహించాలన్నారు. శనివారం జయశంకర్-భూపాలపల్లి జిల్లాలోని కాకతీయ ఖని-5 గనిలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో కార్మికులతో ముఖాముఖి మాట్లాడిన కవిత, వారి సమస్యలను తెలుసుకున్నారు. నాలుగు దశాబ్దాల పాటు గని గర్భంలో శ్రమించిన కార్మికులు పదవీ విరమణ అనంతరం నివాస భద్రత లేక ఇబ్బందులు పడటం బాధాకరమని అన్నారు. ప్రస్తుతం క్వార్టర్లలో నివసిస్తున్న కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన “ఓన్ యువర్ హోమ్” పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి, రూ.10 లక్షల గృహ రుణ సౌకర్యాన్ని అందించాలని కోరారు. సింగరేణి కాలనీల్లో తాగునీరు, స్వచ్ఛమైన గాలి వంటి కనీస సౌకర్యాలు కూడా సక్రమంగా అందడం లేదని ఆమె విమర్శించారు. కార్మికుల ఆరోగ్యం, జీవన ప్రమాణాల మెరుగుదలకు యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాలని, మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం మెడికల్ బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన కవిత, ప్రస్తుతం సుమారు 1,200 మంది కార్మికులు వైద్య పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. నెలకు కనీసం రెండు మెడికల్ బోర్డులు నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించాలని కోరుతూ ప్రభుత్వం, యాజమాన్యానికి జూలై 20 వరకు గడువు ఇస్తున్నట్లు వెల్లడించారు. అప్పటిలోగా స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే గాంధేయ మార్గంలో నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని పేర్కొన్న ఆమె, ఇటీవల గనుల్లో చోటుచేసుకున్న ప్రమాదాలను ప్రస్తావిస్తూ భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలని కోరారు. గనుల్లో ఉపయోగించే సామగ్రి నాణ్యతపై కార్మికుల అభ్యంతరాలను యాజమాన్యం పరిగణనలోకి తీసుకోవాలని, అధికారులు-కార్మికులు అనే తేడా లేకుండా అందరి భద్రతకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సింగరేణిలో “వన్ విజన్ – వన్ ఫ్యామిలీ” విధానం అమలు కావాలని, అధికారుల సంక్షేమం ఎంత ముఖ్యమో కార్మికుల సంక్షేమం కూడా అంతే ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన కోసం తెలంగాణ రక్షణ సేన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ జెండా పండుగలో పాల్గొన్న కవిత, రానున్న రోజుల్లో తెలంగాణ రక్షణ సేనను మరింత బలోపేతం చేసి భూపాలపల్లిలో పార్టీ జెండా ఎగరేస్తామని అన్నారు. కాళేశ్వరం దేవాలయ అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించాలని, మహాముత్తారం, మహాదేవపూర్ మండలాల్లో వంతెనలు నిర్మించాలని, భూపాలపల్లి పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో హెచ్‌ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్, నాయకులు , కార్మికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గని అవరణలోకి వెళ్ళకుండా అడ్డుకున్న యాజమాన్యం: శనివారం ఉదయం కవితతో పాటు హెచ్.ఎం.ఎస్. నాయకులు కేటికె.5 గని అవరణలోకి వెళుతున్నప్పుడు గేట్ వద్దనే సింగరేణి సెక్యూరిటీ సిబ్బందితో పాటు పోలీసులు అడ్డుకున్నారు. అయినా నాయకులు లోపలికి బలవంతంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగి, గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ సందర్భంగా ఏర్పడిన ఘర్షణ వాతావారణం వారు లోపలికి వెళ్లడంతో సద్దు మణిగింది.

Leave A Reply

Your email address will not be published.