ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను రద్దు చేయాలి.
కార్మికుల ప్రాణాలను కాపాడాలి – ఆసిఫ్ పాషా.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 13: బొగ్గు గనుల్లో ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల వినియోగం కారణంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల తీవ్ర ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వాటి వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ ఎం.డి. ఆసిఫ్ పాషా డిమాండ్ చేశారు. సింగరేణి కాలరీస్‌లో కూడా ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల కారణంగా తీవ్ర ప్రమాదాలు జరిగిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారని ఆసిఫ్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందనే భయంతో కార్మికులు విధులు నిర్వర్తించాల్సి వస్తోందన్నారు. దీనివల్ల పని సమయం వృథా కావడంతో పాటు రోజువారీ బొగ్గు ఉత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని తెలిపారు. గతంలో బొగ్గు గనుల్లో వినియోగించిన ఎలక్ట్రిక్ డిటోనేటర్లను తిరిగి ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని కోరారు. కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించడంతో పాటు గనుల్లో సురక్షితమైన పని వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, యాజమాన్యాలపై ఉందన్నారు. సింగరేణి కాలరీస్‌లో చోటుచేసుకున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల వినియోగంపై సమగ్రంగా పరిశీలన జరపాలని విజ్ఞప్తి చేశారు. వాటి వినియోగం వల్ల కార్మికుల భద్రతకు ముప్పు ఉందని తేలితే వాటిని నిషేధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికుల ప్రాణాలే ముఖ్యం. బొగ్గు ఉత్పత్తి కంటే కార్మికుల భద్రతకే యాజమాన్యం, ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆసిఫ్ పాషా స్పష్టం చేశారు.