



అక్షితారాణి మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి.
నిందితులపై అట్రాసిటీ, అత్యాచారం కేసులు నమోదు చేయాలి.
కుటుంబానికి ఉద్యోగం, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.
మృతదేహంతో ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల ఆందోళన.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని టౌన్, సెప్టెంబర్ 14:గోదావరిఖని లెనిన్‌నగర్‌కు చెందిన బీటెక్ విద్యార్థిని తాండ్ర అక్షితారాణి ఆత్మహత్య ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు సోమవారం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వద్ద ఆందోళన చేపట్టారు. జీడీకే-2 ఇంక్లైన్లో శిక్షణకు వెళ్లిన సమయంలో అక్కడి ఓవర్‌మెన్ బొమ్మకంటి రవికుమార్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, ఈ విషయంపై ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని అక్షితారాణి సూ సైడ్ నోట్ లో పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు, ఆందోళనకారులు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న అక్షితారాణి సింగరేణిలో శిక్షణకు వెళ్లిన సమయంలో తనపై వేధింపులు, అత్యాచారం జరిగినట్లు ఆరోపిస్తూ గతంలో సంబంధిత గని వద్ద, జీఎం కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు ఆమె సూ సైడ్ నోట్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే తన ఫిర్యాదును పట్టించుకోకుండా తప్పుడు ఆరోపణగా పేర్కొంటూ తన ఫిర్యాదును మూసివేశారని, ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ పరిణామాలతో తీవ్ర మానసిక క్షోభకు గురైన అక్షితారాణి శనివారం సాయంత్రం పురుగుమందు సేవించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆమెను గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. అనంతరం మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. కాగా అక్షితారాణి రాసినట్లు చెబుతున్న సూ సైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన మృతికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, తనపై అత్యాచారం జరిగినట్లు ఆమె అందులో పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై వాంగ్మూలంలో పేర్కొన్న వ్యక్తి పాత్ర ఏమిటి, గతంలో ఆమె చేసినట్లు చెబుతున్న ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, శిక్షణలో ఉన్న యువతి ఫిర్యాదుపై సంబంధిత అధికారులు ఎందుకు స్పందించలేదనే అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఆందోళనకారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్షితారాణి మరణానికి సంబంధించి సూ సైడ్ నోట్ లో చేసిన ఆరోపణలు, గతంలో ఆమె చేసినట్లు చెబుతున్న ఫిర్యాదు, సంబంధిత అధికారుల స్పందన, ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోంది.
మృతదేహంతో ఆందోళన :
పోస్టుమార్టం అనంతరం అక్షితారాణి మృతదేహాన్ని తరలించేందుకు సిద్ధం చేసిన అంబులెన్స్ ముందు ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల ప్రతినిధులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ముందుగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించిన వారు అనంతరం మృతదేహంతో మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించారు. అక్షితారాణి మృతికి కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బొమ్మకంటి రవికుమార్ తో పాటు ఫిర్యాదును పట్టించుకోలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జీ-1 జీఎంపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మార్పీఎస్ నాయకులు చెన్నూరి శ్రీనివాస్, అంబాల రాజేందర్, కస్తూరి ధర్మేందర్, పల్లె బాపు, రాసకట్ల రవికుమార్ తదితరులు మాట్లాడుతూ అక్షితారాణి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. విద్యార్థిని మృతికి దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహించి బాధ్యులెవరైనా చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అక్షితారాణి కుటుంబంలో ఒకరికి సింగరేణి యాజమాన్యం ఉద్యోగం కల్పించాలని, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వారు డిమాండ్ చేసారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తప్పించే ప్రయత్నం చేస్తే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మాదిగలు, ఉపకులాలు, అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి ఉద్యమం చేపడతామని ప్రకటించారు. కాగా ఇంచార్జి ఎసిపి ప్రవీణ్ కుమార్, వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి బాధిత కుటుంబ సభ్యులు, నాయకులతో మాట్లాడి ధర్నా విరమింప జేశారు.