Take a fresh look at your lifestyle.

సింగరేణికి తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ కేటాయింపు చారిత్రాత్మక నిర్ణయం : జనక్ ప్రసాద్.

0 20

సింగరేణికి తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ కేటాయింపు చారిత్రాత్మక నిర్ణయం.
సంస్థ భవిష్యత్, కార్మికుల ఉపాధి భద్రత కోసం మరిన్ని బొగ్గు బ్లాకులు కేటాయించాలి.

ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ డాక్టర్ జనక్ ప్రసాద్.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, జూలై 9:సింగరేణి సంస్థకు తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ కేటాయించడం సంస్థ భవిష్యత్ అభివృద్ధి, బొగ్గు ఉత్పత్తి పెంపు, కార్మికుల ఉద్యోగ భద్రతకు చారిత్రాత్మక నిర్ణయమని ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ డాక్టర్ జనక్ ప్రసాద్ పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సింగరేణికి మరిన్ని బొగ్గు బ్లాకులను కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని ఆయన కోరారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ కేటాయింపుకు సహకరించిన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి దీర్ఘకాలిక అభివృద్ధి, కార్మికుల ఉద్యోగ భద్రత, తెలంగాణ పారిశ్రామిక ప్రగతిని దృష్టిలో ఉంచుకుని ఐఎన్‌టీయూసీతో పాటు తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు. తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్‌లో సుమారు 182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, దీని ద్వారా సంవత్సరానికి 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ బ్లాక్‌తో రానున్న 40 నుంచి 50 సంవత్సరాల పాటు సింగరేణికి అవసరమైన బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండటంతో సంస్థ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది ఏర్పడుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 64 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉందని, వేలం లేకుండా బొగ్గు బ్లాక్ కేటాయించడంతో సింగరేణిపై పడే 2,550 కోట్ల రూపాయల ప్రీమియం భారం తప్పిందని చెప్పారు. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి రాయల్టీలు, పన్నులు తదితర రూపాల్లో సంవత్సరానికి సుమారు 16 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశముందని వివరించారు. ఈ బొగ్గు బ్లాక్ అభివృద్ధి ద్వారా ప్రత్యక్షంగా సుమారు 1,200 మందికి ఉపాధి లభిస్తుందని, పరోక్షంగా రవాణా, యంత్ర పరికరాలు, సేవారంగం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తదితర అనుబంధ రంగాల్లో వేలాది మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోయగూడెం బ్లాక్–3, సత్తుపల్లి బ్లాక్–3తో పాటు గోదావరి వ్యాలీలోని ఇతర బొగ్గు బ్లాకులను కూడా సింగరేణికి కేటాయించాలని ఐఎన్‌టీయూసీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని జనక్ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయానికి సహకరించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు కార్మికులు, ఐఎన్‌టీయూసీ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.డి. చంద్రశేఖర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ధర్మపురి, త్యాగరాజన్, కాంపెల్లి సమయ్య, జెట్టి శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.