Take a fresh look at your lifestyle.

సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే జీఎస్సార్ : కృతజ్ఞతలు తెలిపిన ఐఎన్టీయూసీ.

0 8

సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన గండ్ర : కృతజ్ఞతలు తెలిపిన ఐఎన్టీయూసీ.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)

జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 19: సింగరేణి కార్మికుల సమస్యలను తెలంగాణ శాసనసభలో ప్రస్తావించి, వాటి పరిష్కారానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు భూపాలపల్లి ఏరియా ఐఎన్టీయూసీ బ్రాంచ్, సింగరేణి కార్మికుల తరఫున నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం భూపాలపల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గండ్ర సత్యనారాయణరావును ఐఎన్టీయూసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సింగరేణి కార్మికుల సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తావించారు. సింగరేణి మెడికల్ బోర్డు పరీక్షలను కొత్తగూడెంలో కాకుండా సంబంధిత ఏరియా ఆసుపత్రుల్లోనే నిర్వహించాలని, అన్‌ఫిట్ విధానాన్ని ప్రతి నెలా క్రమం తప్పకుండా అమలు చేయాలని కోరారు. కంపెనీ అధికారులకు అమలు చేస్తున్న అలవెన్సులు, ఆదాయపు పన్ను విధానాన్ని కార్మికులకు కూడా సమానంగా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ అధికారులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందిస్తున్న రూ.25 లక్షల వైద్య ఆర్థిక సహాయాన్ని రిటైర్డ్ కార్మికులకు కూడా వర్తింపజేసి, ప్రస్తుతం ఉన్న రూ.8 లక్షల పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేందుకు కనీసం 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని కోరారు. కార్మికుల సర్వీస్ రికార్డుల్లో ఉన్న మారుపేర్ల సమస్యలు, సంబంధిత కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్స్‌ను తెలంగాణలో అమలు చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు ఐఎన్టీయూసీ భూపాలపల్లి ఏరియా బ్రాంచ్, సింగరేణి కార్మికుల పక్షాన నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏరియా ఐఎన్టీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బెతెల్లి మధుకర్‌రెడ్డి, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు, జనరల్ సెక్రటరీ పసునూటి రాజేందర్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ అండెం రఘుపతిరెడ్డి, నాయకులు సజ్జనపు స్వామి, భరత్‌ కుమార్, కేటీకే-ఓసీ-2 ప్రాజెక్టు (యూజీ) వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్ ఎన్. సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కోచర్ల రవికుమార్, కేటీకే-1 ఇంక్లైన్ పిట్ సెక్రటరీ సోతుకు సమ్మయ్య, కేటీకే-6 ఇంక్లైన్ పిట్ సెక్రటరీ చిరుత లక్ష్మీనారాయణ, కేటీకే-8 ఇంక్లైన్ పిట్ సెక్రటరీ సంగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.