వృద్ధుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
గౌరవప్రదమైన జీవనం, మెరుగైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలి.
డెమొక్రటిక్ సీనియర్ సిటీజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఘట్కేసర్, అక్టోబర్ 1: వృద్ధుల హక్కుల పరిరక్షణతోపాటు వారికి గౌరవప్రదమైన జీవనం, మెరుగైన వైద్య సేవలు, ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డెమొక్రటిక్ సీనియర్ సిటీజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ కోరారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని కోర్రెముల సుప్రభాత్ టౌన్షిప్లో డెమొక్రటిక్ సీనియర్ సిటీజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వయోవృద్ధులు రాసకట్ల పోశం, బంగారి మల్లయ్య, ఎం. సత్యనారాయణలను శాలువాలతో సత్కరించి, కేక్ కట్ చేసి వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం వేణు మాధవ్ మాట్లాడుతూ ప్రతి ఏడాది అక్టోబర్ 1న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా వృద్ధుల సంక్షేమం, హక్కులు, ఆరోగ్యం, సామాజిక భద్రత, గౌరవప్రదమైన జీవనంపై సమాజంలో అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. ఐక్యరాజ్యసమితి 1990 డిసెంబర్ 14న అక్టోబర్ 1ను అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా ప్రకటించిందని పేర్కొన్నారు. వృద్ధులు తమ జీవితాలను కుటుంబ అభివృద్ధికి, సమాజ నిర్మాణానికి, దేశ ప్రగతికి అంకితం చేశారని వేణు మాధవ్ అన్నారు. అపారమైన అనుభవం, జ్ఞానాన్ని తర్వాతి తరాలకు అందిస్తున్న వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వృద్ధాప్యంలో ప్రేమ, ఆప్యాయతతోపాటు ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక భద్రత, మానసిక ప్రశాంతత ఎంతో అవసరమని తెలిపారు. భారతదేశంలో తల్లిదండ్రులు, వృద్ధ పౌరుల పోషణ మరియు సంక్షేమ చట్టం–2007 అమలులో ఉందని, అర్హులైన వృద్ధ తల్లిదండ్రులు పోషణ కోసం చట్టపరమైన సహాయం పొందే అవకాశం ఈ చట్టం కల్పిస్తుందని వివరించారు. అయితే చట్టాలను రూపొందించడం మాత్రమే కాకుండా వాటిని సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉందన్నారు. వృద్ధులకు గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు సరిపడా పింఛన్ అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య సేవలు, అవసరమైన మందులు, వైద్య పరీక్షలు అందుబాటులో ఉంచాలని కోరారు. ఆసుపత్రులు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల్లో వృద్ధులకు ప్రాధాన్యత కల్పించాలని, బస్సులు, రైల్వే స్టేషన్లు, ఇతర ప్రజా ప్రదేశాల్లో వృద్ధులకు అనుకూలమైన సౌకర్యాలను మరింత విస్తరించాలని సూచించారు. ప్రస్తుతం అనేక మంది వృద్ధులు ఒంటరితనం, కుటుంబ నిర్లక్ష్యం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని వేణు మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు తమ పిల్లల ఆదరణకు దూరమై కనీస అవసరాల కోసం కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇటువంటి పరిస్థితులను నివారించేందుకు కుటుంబ సభ్యులు వృద్ధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, వారి అభిప్రాయాలను గౌరవిస్తూ కుటుంబ నిర్ణయాల్లో భాగస్వాములను చేయాలని కోరారు. వృద్ధుల ఆస్తులను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం, వేధించడం, నిర్లక్ష్యం చేయడం వంటి ఘటనలను అరికట్టేందుకు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఫిర్యాదు వ్యవస్థను మరింత బలోపేతం చేసి, వారికి సత్వర సహాయం అందించాలని కోరారు. వృద్ధులు సమాజానికి భారం కాదని, వారు అనుభవజ్ఞులైన మార్గదర్శకులని స్పష్టం చేశారు. యువత వృద్ధుల అనుభవాల నుంచి నేర్చుకుని, వారి సేవలను గుర్తించి గౌరవించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు రాసకట్ల పోశం, ఎం. సత్యనారాయణ, బంగారి మల్లయ్య, ఎస్. లక్ష్మీనారాయణ, ఎం. రాజా నర్సు, చుక్కల నర్సయ్య, టి. శ్రీనివాస్, ఏ. ప్రభాకర్, ప్రతాప్ సింగ్, రవీందర్, ఎం.డి. రఫిక్ అహ్మద్, వంగ రవీందర్ రెడ్డి, బి. ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.